మెటీరియల్ సైన్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నింగ్ సంస్థ తెలంగాణలో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. న్యూయార్క్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్న కర్నింగ్ సంస్థ మెటీరియల్ సైన్స్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థగా నిలిచింది. 172 సంవత్సరాలు చరిత్ర కలిగిన సంస్థ తెలంగాణ రాష్ట్రాన్ని తన తయారీ కేంద్రంగా ఎంచుకున్నది. తెలంగాణ రాష్ట్రంలో 934 కోట్ల రూపాయలతో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే ఈ తయారీ ప్లాంట్ ద్వారా సంస్థ మొబైల్ ఫోన్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు అవసరమైన గొరిల్లా గ్లాస్ ను తయారు చేయనున్నది. భారతదేశంలో ఇలాంటి గొరిల్లా గ్లాస్ తయారీ ప్లాంట్ కి తెలంగాణ తొలి కేంద్రం కానున్నది. ఈ భారీ పెట్టుబడి ద్వారా ఎనిమిది వందల మందికిపైగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి.
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ తో సంస్థ సీనియర్ ఉపాధ్యక్షులు జాన్ బెయిని ప్రతినిధి బృందం మంత్రి కేటీఆర్ తో సమావేశమైంది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పెట్టుబడుల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఐటీ శాఖ ఎలక్ట్రానిక్స్ డైరెక్టర్ సుజయ్ కారంపురి తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మంత్రి కే. తారక రామారావు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ సంబంధిత రంగాలకు తెలంగాణ రాష్ట్రం తయారీ కేంద్రంగా మారుతున్న తీరును వివరించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగ ఈకో సిస్టం తెలంగాణలో బలోపేతమైన తీరును, అందుకోసం తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలకు పైగా కాలంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా అనేక ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని, మరికొన్ని సంస్థలు తమ కార్యకలాపాలను విస్తృతపరుస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ తెలియజేశారు. దీంతోపాటు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఫాక్స్ కాన్ కూడా భారీ ఎత్తున తమ తయారు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న విషయాన్ని, ఫాక్స్ కాన్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వ పాలసీల పట్ల ఇచ్చిన ప్రశంసలను ప్రత్యేకంగా ఈ సమావేశంలో ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అనుకూలతలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ అనుబంధ రంగాల్లో తయారీ రంగ పెట్టుబడుల కోసం తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న చొరవను, ప్రోత్సాహాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తమకు తయారీ ప్లాంట్ కి కేంద్రంగా ఎంచుకున్నట్లు కార్నింగ్ సంస్థ ప్రతినిధులు మంత్రి కేటీఆర్ కి తెలిపారు. వివిధ అంతర్జాతీయ నగరాలను తమ పెట్టుబడి కోసం పరిశీలించి హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వారు మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు.