Monday, March 9, 2026
Homeసినిమాప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు ఇకలేరు

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు ఇకలేరు

తెలుగు సినిమా, టీవీ , రంగస్థల నటుడు రాజబాబు ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజబాబు ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. రాజబాబుకు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక అమ్మాయి వున్నారు. రాజబాబును అందరూ బాబాయ్ అని ఆప్యాయంగా పిలుస్తారు . తెర మీద గంభీరంగా కనిపించే రాజబాబు నిత్య జీవితంలో చాలా సరదామనిషి. తన చుట్టూ వున్న వారిని  హాయిగా నవ్విస్తూ వుండే రాజబాబు మరణించారన్న వార్త దిగ్భ్రాంతి కలిగించింది.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపురపేటలో 13 జూన్ 1957న రాజబాబు జన్మించారు. ఆయన తండ్రి పేరు రామతారకం. ఆయన చిత్ర నిర్మాత నటుడు.  దాసరి నారాయణ రావు దర్శకత్వంలో  ‘స్వర్గం –నరకం’, ‘రాధమ్మ పెళ్లి’ సినిమాలను నిర్మించారు. కాకినాడలో స్థిరపడిన రాజబాబుకు వ్యవసాయం చెయ్యడమన్నా, కబడ్డీ ఆడటమన్నా, రంగస్థలంమీద నటించడమన్నా ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ  దేశమంతా తిరిగారు.  దర్శకుడు ఉప్పలపాటి నారాయణరావు రాజబాబును 1995లో  ‘ఊరికి మొనగాడు’ అనే సినిమాలో అవకాశం ఇచ్చి సినిమా రంగానికి పరిచయం చేశారు. ‘సింధూరం’ తరువాత రాజబాబును అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

కాకినాడ నుంచి రాజబాబు హైదరాబాద్ కు మకాం మార్చి  సినిమా రంగంపై దృష్టి పెట్టారు. అనతికాలంలోనే రాజబాబు ‘సముద్రం’, ‘ఆడవారి మాటలకు  అర్ధాలే వేరులే’, ‘మురారి’, ‘శ్రీకారం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘కళ్యాణ వైభోగం’, ‘మళ్ళీ రావా?’, ‘భ్రహ్మోత్సవం’, ‘భరత్ అనే నేను’  తదితర 62 చిత్రాల్లో  విభిన్నమైన పాత్రలను పోషించారు . సినిమాతో పాటు  టీవీ రంగంలో కూడా రాజబాబు నటించారు. వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి.ల.సౌ. స్రవంతి, ప్రియాంక సీరియల్స్  లో పోషించిన పాత్రలు రాజబాబు కు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.  రాజబాబు 48 సీరియల్స్ లో విభిన్నమైన పాత్రల్లో నటించి అందరికీ ఆత్మీయుడయ్యారు.

‘అమ్మ’ సీరియల్ లో అయన పోషించిన పాత్రకు 2005లో నంది అవార్డు వచ్చింది. రాజబాబును కాకినాడలో ఘనంగా సత్కరించారు. రాజబాబు కు పుట్టి పెరిగిన వూరు అంటే ఎంతో ఇష్టం , సంక్రాంతికి కాకినాడ వెళ్లి మిత్రులతో సరదాగా గడుపుతూ , కోడి పందాలలో పాల్గొనేవారు. సినిమా రంగంలోనూ , టీవీ రంగంలోనూ రాజబాబుకు ఎంతో మంది స్నేహితులు , ఆత్మీయులు వున్నారు. తెలుగుతనాన్ని తెరమీద పంచి తెరమెరుగైన రాజబాబు ఎప్పటికీ తన పాత్రల ద్వారా చిరంజీవిగా ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular