Dates confirmed: కరోనా మూడో వేవ్, ఓమిక్రాన్ తీవ్రత కారణంగా వాయిదా పడిన సినిమాల విడుదల తేదీలు ఖరారయ్యాయి. మొన్న దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ నిర్మాతలందరం మాట్లాడుకొని అతి త్వరలో విడుదల తేదీలు ప్రకటిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విడుదల తేదీలు ఖరారు చేశారు.
మొదటగా రాజమౌళి దర్శకత్వంలో రాం చరణ్, ఎన్టీఆర్ నటించిన ‘ఆర్ ఆర్ ఆర్ ‘ మార్చి 25న విడుదల కానుంది.
పవన్ కళ్యాన్, దగ్గుబాటి రానా ముఖ్యపాత్రల్లో నటించి సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘భీమ్లా నాయక్’ ఏప్రిల్ 1న విడుదలవుతోంది.
మెగా స్టార్ చిరంజీవి హీరోగా, రామ్ చరణ్ కీలక పాత్రలో నటించి, కొరటాల శివ రూపొందించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న విడుదల కానుంది. సరిగ్గా 34 ఏళ్ళక్రితం ఇదే రోజున చిరంజీవి నటించిన ‘యముడికి మొగుడు’ విడుదలైంది. ఆ సినిమా ఘనవిజయం సాధించి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు చేసింది. అదే కోవలో ఆచార్య కూడా అదే స్థాయి విజయం సాధిస్తుందని యూనిట్ బలంగా విశ్వసిస్తోంది.
మహేష్ బాబు హీరోగా, పరశురాం దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్కారు వారి పాట’ మే 12న విడుదలవుతోంది.
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కీలక పాత్రల్లో నటిస్తూ…. దిల్ రాజు నిర్మాతగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఎఫ్ 3’ ఏప్రిల్ 28న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ విడుదల తేదీ ఇంకా ఖరారు కావాల్సి ఉంది. సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మర్చి 11న విడుదల కానుంది.