Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది?

ఏ రాశుల వారికి ఎలా ఉండబోతోంది?

2022 Yearly  Horoscope in Telugu :

మేషం (Aries):
ఆదాయం – 14                     వ్యయం – 14
రాజపూజ్యం – 3                   అవమానం – 6

ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్తగా చేపట్టే పనుల పూర్తికి కొంచెం ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. సంపాదన మార్గాన్ని మార్చుకోవడం వల్ల, అవసరానికి సరిపడా డబ్బు సమకూరుతుంది. సంవత్సరం ద్వితీయార్థంలో శుభకార్యాల మూలంగా డబ్బు విపరీతంగా ఖర్చవుతుంది. స్థిరాస్తులు అమ్మాల్సి రావచ్చు. కుటుంబ సౌఖ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది. సంతాన సంబంధ విషయాల్లో కొంతమేర వృద్ధి కనిపిస్తుంది. జీవిత భాగస్వామి, సంతానం తరచూ మీతో విభేదిస్తుంటారు. ఈ జాతకులు ఎక్కువకాలం ఇంటికి దూరంగా ఉండాల్సి రావచ్చు. దుర్వ్యసనాల వల్ల సమస్యలు ఎదుర్కొనే సూచనలున్నాయి. అయితే, దీర్ఘవ్యాధుల వల్ల చికాకులు ఉండవు. జంతువుల వల్ల ఇబ్బందులు తలెత్తే వీలుంది. కఠినంగా మాట్లాడడం, కలహాలకు కాలు దువ్వడం మంచిది కాదు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించడంతోపాటే, బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించక పోవడం వల్ల విమర్శలూ ఎదుర్కోవాల్సి వస్తుంది. సస్పెన్షన్ లేదా బర్త్‌రఫ్‌ అయ్యే సూచనలూ గోచరిస్తున్నాయి. విదేశాలతో వ్యవహారాలు నడిపేవారికి గౌరవ మర్యాదలు, సన్మానాలు దక్కుతాయి. ముఖ్యంగా విద్యార్థులు విదేశీ విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలు సానుకూలమవుతాయి. నిరుద్యోగులకు ఈ సంవత్సరం కల నెరవేరుతుంది. ఈ సంవత్సరం మీకెదురయ్యే అనుభవాలు మీలో క్రమశిక్షణను పెంపొందిస్తాయి. కొత్త జవసత్వాలతో, నూతనోత్సాహంతో ముందుకు సాగేందుకు తోడ్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలను పెంచుకోగలుగుతారు. ఈరాశి వారు క్రమం తప్పకుండా, పార్వతీపరమేశ్వరులను ఆరాధిస్తే మేలిమి ఫలితాలు కలుగుతాయి.

వృషభం (Taurus):
ఆదాయం – 8                       వ్యయం – 8
రాజపూజ్యం – 6                   అవమానం – 6

ఈ సంవత్సరం మీ శ్రమ తత్త్వమే విజయాలకు చేరువ చేస్తుంది. దాదాపుగా ఏ పని కూడా సవ్యంగా సాగని స్థితి ఉంటుంది. అత్యంత అప్రమత్తంగా ముందడుగు వేస్తుండాలి. ధనాదాయంలో వృద్ధి అంతంత మాత్రంగానే ఉంటుంది. అయితే, అనూహ్యంగా వచ్చిపడే ఖర్చులు ఇబ్బంది పెడతాయి. శుభకార్యాలకూ విఘ్నాలు ఏర్పడే వీలుంది. చేయని తప్పుకి శిక్ష పడుతుంది. చిన్నచిన్న విషయాల్లో కూడా ఇతరుల కోపానికి గురవుతారు. కుటుంబంలో జీవితభాగస్వామి, సంతాన మూలకంగా మానసిక క్షోభ కలుగుతుంది. సంతానపు ఆరోగ్య సమస్యలు వేదనకు గురిచేస్తాయి. ఇంటిపోరు, ఊహించని కష్టాలు మిమ్మల్ని నిలకడగా ఉండనివ్వవు. ఈ సంవత్సరం తల్లిదండ్రులు లేదా వారికి సమానమైన వారికి, ప్రాణాంతకం లాంటి పరిస్థితి వస్తుంది. ఎక్కువ కాలం ఇంటికి దూరంగా ఉండాల్సి రావచ్చు. వ్యక్తిగత ఆరోగ్యంపైనా శ్రద్ధ పెట్టండి. ప్రయాణాల వల్ల ధననష్టమే తప్ప ప్రయోజనం ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోని వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన కాలమిది. శత్రువులు పెరుగుతారు. ముఖ్యంగా ఉగాది తర్వాత పదవీచ్యుతి లేదా దానికి సమానమైన శిక్షను ఎదుర్కోవాల్సి రావచ్చు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ రాశివారికి, వాహనాల క్రయవిక్రయాల వల్ల స్వల్పంగా ఆదాయం సమకూరుతుంది. విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారు స్థిరపడతారు. విద్యాభ్యాసం కోసం విదేశాలు వెళ్లాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు, అవమానాలు సమానంగా ఉంటాయి. జరుగుతున్న పరిణామాల వల్ల మీలో దైవభక్తి లోపించే వీలుంది. స్థిరచిత్తంతో కూడిన మీ విజ్ఞత వల్ల పరిస్థితులను అధిగమించగలుగుతారు. నిత్యం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యస్వామి వారిని ఆరాధించడం వల్ల మేలు కలుగుతుంది.

మిథునం (Gemini):
ఆదాయం – 11                     వ్యయం – 5
రాజపూజ్యం – 2                   అవమానం – 2

నిరుటి కంటే ఈ సంవత్సరం కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. అయితే, ఏదీ సులభంగా చేతికి అందదు. చేపట్టిన ప్రతి పనీ కష్టసాధ్యంగా ఉంటుంది. ఫలితాలు చాలా నెమ్మదిగా సిద్ధిస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు చికాకు పెడతాయి. అనుకోని అదృష్టం వరిస్తుంది. స్థలం లేదా భూమిని కొనుగోలు చేసే సూచనలున్నాయి. అది మీలో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇష్టంలేని పనులు చేయాల్సి రావడం, ప్రతి పనికీ అడ్డంకులు ఎదురు కావడం మీలో అసహనాన్ని పెంచుతుంది. జీవనశైలి మీరు కోరుకున్నట్లుగా ఉండదు. అందరూ మిమ్మల్ని కించపరిచేలా మాట్లాడుతుంటారు. చిన్న చిన్న ప్రతికూలతలను కూడా తట్టుకోలేని స్థితి ఏర్పడుతుంది. కుటుంబానికి, బంధువులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ప్రయాణాలు అనుకూలించవు. అపమృత్యు భయం వెంటాడుతుంది. నిశ్చింతగా ఉండలేని పరిస్థితి ఉంటుంది. జీవితభాగస్వామి, సంతానం వల్ల మానసిక చింత అధికమవుతుంది. సంతాన సంబంధ అనారోగ్యాలు ఆందోళనను కలిగిస్తాయి. సంతానంతో విరోధం గోచరిస్తోంది. తల్లి యోగక్షేమాలను కనిపెట్టుకుని ఉండండి. శత్రువుల కుట్రలను కనిపెట్టుకుని ఉండండి. కాలం ఎంత సమస్యలమయంగా ఉన్నా, సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. అపనిందలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పితృదేవతలను ఆరాధించండి. పెద్దల ఆదరణ, ఆశీర్వాదాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా లేదు. తరచూ అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుంది. ఏ పని చేసినా కలిసిరాదు. విద్యార్థులు పలితాల కోసం చాలా ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. తరచూ శివారాధన, శనైశ్చరుడికి తైలాభిషేకం చేయడం వల్ల పరిస్థితులు కొద్దిగా అనుకూలిస్తాయి.

2022 Yearly  Horoscope in Telugu :

కర్కాటకం (Cancer):
ఆదాయం – 5                       వ్యయం – 5
రాజపూజ్యం – 5                   అవమానం – 2

ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. సకల సౌభాగ్యాలూ సమకూరతాయి. చేపట్టిన పనులన్నీ లాభదాయకంగా ఉంటాయి. ధనాదాయం బాగా పెరుగుతుంది. అనూహ్య ధనలాభం కూడా గోచరిస్తోంది. తరచూ విందు వినోదాల్లో పాల్గొంటారు. నిత్యం బంధుమిత్రులను కలుస్తూ, ఉల్లాసంగా గడుపుతుంటారు. కుటుంబంలో సుఖశాంతులతో పాటు చికాకులూ ఉంటాయి. జీవిత భాగస్వామి వ్యవహార శైలి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. సంతానానికి సంబంధించిన చేదు వాస్తవాలు వినాల్సి వస్తుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు, పెద్దల ఆదరాభిమానాలను చూరగొంటారు. అనారోగ్య సూచనలున్నాయి. వాత సంబంధ సమస్యలు బాగా ఇబ్బంది పెట్టొచ్చు. అకారణ విరోధాల వల్ల మిత్రులకు దూరమయ్యే వీలుంది. వ్యవహారాల్లో అనవసర చిక్కుల్లో పడతారు. ఆచితూచి వ్యవహరించండి. వాహనం కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పశు సంబంధ వృత్తి, వ్యాపారాలు చేసే వారికి ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంటుంది. సంపాదనకు తగినట్లుగా ఖర్చులూ ఉంటాయి. చిత్త చాంచల్యం వల్ల అవమానాలకు గురయ్యే వీలుంది. ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తారు. విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు గణనీయమైన వృద్ధి ఉంటుంది. అయితే అప్రమత్తంగా లేకుంటే పెద్దవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. రాజకీయాల్లోని వారికి ఉన్నత పదవులు లభిస్తాయి. ధర్మమార్గాన పయనిస్తారు. ఎవరితోనూ కఠినంగా మాట్లాడకండి. ఇంతకాలం పడ్డ అన్ని విధాల కష్టనష్టాలు తొలగి సుఖశాంతులతో హాయిగా ఉంటారు. ఈ సంవత్సరం మరిన్ని మంచి ఫలితాల కోసం తరచూ శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించండి.

సింహం (Leo):
ఆదాయం – 8                       వ్యయం – 14
రాజపూజ్యం – 1                   అవమానం – 5

ఈ సంవత్సరం ప్రారంభంలో అభీష్టాలు నెరవేరతాయి. తలపెట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు దక్కుతాయి. అవసరానికి సరిపడా డబ్బు కూడా సమకూరుతుంటుంది. పర్యటక స్థలాలను సందర్శిస్తారు. వివిధ వ్యాసంగాలతో ఉల్లాసంగా గడుపుతారు. ద్వితీయార్థంలో పనులు కాస్త మందగిస్తాయి. విపరీతంగా అలసిపోతారు. ఆదాయానికి మించి ఖర్చులు వచ్చిపడతాయి. అనూహ్యంగా కష్టాలన్నీ ఒక్కసారిగా మీదపడినట్లుగా ఉంటుంది. పెద్దవారి ఆగ్రహానికి గురికావడం మీ మానసిక శాంతిని దూరం చేస్తుంది. మనసు అదుపు తప్పి మాట తూలే పరిస్థితులుంటాయి. ఈ కాలంలో, సహకరించేవారెవరూ లేక.. ఏ పని చేసినా కలిసిరాదు. నిరాశ అలముకుంటుంది. వస్తు వాహనాలను అమ్ముకునే పరిస్థితులూ రావచ్చు. ప్రస్తుతానికి మీరు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా.. ఎన్నటికైనా విజృంభిస్తారన్న భయంతో.. మీ శత్రువులు అణిగిమణిగి ఉంటారు. అయితే, లేనిపోని వదంతులను సృష్టిస్తూ చికాకు కలిగిస్తుంటారు. ప్రతిదీ మీరు ఊహించినదానికి భిన్నంగా జరుగుతుంటుంది. ముఖ్యమైన పనుల కోసం చేసే ప్రయాణాలు ఫలించే సూచనలు లేవు. కుటుంబంలో అనుకూల పరిస్థితులున్నా, ఇంటికి దూరంగా గడపాల్సిన పరిస్థితులు వస్తాయి. కుటుంబసభ్యుల అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో దూకుడు పనికిరాదు. మీ మేనమామలకు అంత క్షేమకరమైన కాలం కాదు. ఉద్యోగస్తులు అత్యంత జాగ్రత్తగా కాలం గడపాలి. దుందుడుకు చేష్టల వల్ల ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి రావచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. మీ ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణలే మిమ్మల్ని చిక్కుల నుంచి బయటపడేస్తాయి. తరచుగా, సాయినాధుని, గౌరీదేవిని దర్శించుకోవడం వల్ల మీకు మేలిమి ఫలితాలు కలుగుతాయి.

కన్య (Virgo):
ఆదాయం – 11                     వ్యయం – 5
రాజపూజ్యం – 4                   అవమానం – 5

ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంవత్సరం ప్రారంభంలో ఒడుదుడుకులుగా సాగినా, ద్వితీయార్తంలో పరిస్థితులు కొద్దిగా మెరుగవుతాయి. ముఖ్యమైన పనుల్లో ఎదురు దెబ్బలు తగిలే వీలుంది. దాయాదులు, మీరంటే గిట్టని వారు తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తారు. అయినా పెద్దవారి ఆదరాభిమానాలు పుష్కలంగా ఉండడంతో, నెమ్మదిగానే అయినా.. పనులు సానుకూలమవుతాయి. మానసిక ఉల్లాసం కోసం విహార, తీర్థయాత్రలు చేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఆత్మీయుల నుంచి బహుమతిని అందుకుంటారు. గృహోపకరణాలను సమకూర్చుకుంటారు. అవగాహనలేని పనుల వల్ల కూడా ధనాన్ని నష్టపోతారు. ప్రయాణాల వల్ల దుఃఖాలు కలుగుతాయి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోండి. తరచూ అయినవారితోనే కలహాలకు దిగే సూచనలున్నాయి. దీనివల్ల శత్రువులు పెరుగుతారు. దాంతోపాటే భయమూ పెరుగుతుంది. అపనిందలు, అవమానాలను ఎదుర్కొంటారు. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామి సహకారంతో ఇంటి సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఇంటికి అవసరమైన చిన్నచిన్న సౌకర్యాలను సమకూర్చుకోగలుగుతారు. సంతాన విషయక చింత ఉంటుంది. సంతానపు ఆరోగ్యం ఇబ్బంది పెట్టొచ్చు. వారి విద్యాభ్యాసానికి అవరోధాలు ఏర్పడే పరిస్థితులూ ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. బంధుమిత్రులతో విరోధాలుంటాయి. దాయాదుల వ్యాజ్యాలు మిమ్మల్ని కోర్టు మెట్లెక్కిస్తాయి. తద్వారా ఆస్తిని కోల్పోయే పరిస్థితి ఉంది. స్థిమితం కోల్పోతారు. నీచులను దూరంగా ఉంచి, సమస్యలను సామరస్యంతో పరిష్కరించుకుంటే మేలు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. తరచూ నవగ్రహారాధాన, ఆంజనేయస్వామిని దర్శించుకుంటూ ఉండడం వల్ల పరిస్థితులు కాస్త సానుకూలం అవుతాయి.

తుల (Libra):
ఆదాయం – 8                       వ్యయం – 8
రాజపూజ్యం – 7                   అవమానం – 5

మిశ్రమ ఫలితాలుంటాయి. ఈ సంవత్సరం పనుల పూర్తి కోసం విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. అవసరానికి సరిపడినంత డబ్బు సమకూరుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు. స్వయం సమృద్ధితో ఇతరులకు సహాయం చేసే పరిస్థితులు ఉంటాయి. సంవత్సరం ద్వితీయార్థంలో కొంత ప్రతికూలత ఉంటుంది. దాయాదుల పీడ అధికమవుతుంది. రోగాలు కూడా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా జీర్ణకోశ సంబంధ సమస్యలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో సఖ్యత లోపిస్తుంది. జీవిత భాగస్వామితో ఎడబాటు గోచరిస్తోంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా దూరప్రాంతాల్లో ఇంటికి దూరంగా ఉండే వీలుంది. సంసారానికి దూరంగా ఉండడం క్షోభకు గురిచేస్తుంది. వివాహేతర సంబంధాలు సంసారంలో చిచ్చు పెడతాయి. పిల్లలు లేని వారికి ఈ సంవత్సరం సంతానయోగం ఉంది. సంతానం మీ మాట వినని పరిస్థితి వస్తుంది. సంతాన సంబంధ విషయాల్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటూ, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే మానసిక ప్రశాంతత ఉండదు. వారసత్వ ఆస్తులు అమ్మే వీలుంది. దాయాదుల వల్ల సమస్యలుంటాయి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చితే ఎదురుదెబ్బలు తప్పవు. అనవసరంగా డబ్బు కూడా నష్టపోయే వీలుంది. విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధువుల్లో ముఖ్యమైన వారి గురించి దుర్వార్త వింటారు. ప్రయాణాల్లో డబ్బు నష్టపోతారు. వాహనాలను స్వయంగా నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మంచి వ్యక్తులతో స్నేహాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తరచూ శనైశ్చరుడికి తైలాభిషేకం చేస్తూ, నవగ్రహాలను ఆరాధిస్తే పరిస్థితులు కొద్దిగా అనుకూలిస్తాయి.

2022 Yearly  Horoscope in Telugu :

వృశ్చికం (Scorpio):

ఆదాయం – 14                     వ్యయం – 14
రాజపూజ్యం – 3                   అవమానం – 1

గతం కంటే ఇది ఎంతో అనుకూలమైన సంవత్సరమనే చెప్పాలి. తలపెట్టిన పనులు సానుకూలం అవుతాయి. ధనలాభం ఉంటుంది. శుభకార్యాల కోసం ఖర్చు చేస్తారు. ధార్మిక కార్యక్రమాల కోసమూ డబ్బు వెచ్చిస్తారు. స్థలాలు కొనుగోలు చేస్తారు. ఉన్నత స్థాయి జీవన శైలి అలవాటవుతుంది. బంధువుల వల్ల ఇబ్బందులు వస్తాయి. అవమానాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. మిత్రుల సహాయ సహకారాలు మీ ఎదుగుదలకు దోహదం చేస్తాయి. ఆర్థిక స్థిరత్వం కోసం పూర్వీకుల ఆస్తులు అమ్మాల్సి రావచ్చు. దాసీజనంతో సేవలు చేయించుకునే పరిస్థితి ఉంటుంది. నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. ముఖ్యమైన పనుల కోసం జరిపే ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉండదు. విదేశీ ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఈ సంవత్సరం అనుకూలిస్తాయి. అయితే శారీరక, మానసిక సుఖాలకు దూరం కావాల్సి వస్తుంది. జీవిత భాగస్వామికి దూరంగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది. బంధువుల్లో ముఖ్యమైన వారు దూరమవుతారు. సంతానం వృద్ధిలోకి రావడం మీకు ఆనందాన్నిస్తుంది. శత్రువుల పీడ తొలగిపోతుంది. కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి అంత అనుకూలంగా లేదు. తరచూ అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఈ సంవత్సరం నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాల కోసం కాస్త ఎక్కువగా కృషి చేయాల్సి ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానం లేని వారి కోరిక ఈ సంవత్సరం నెరవేరుతుంది. ఉదర సంబంధ సమస్యలు ఇబ్బంది పెట్టే వీలుంది. స్థూలంగా ధైర్యంతో ముందడుగు వేయడం ద్వారా శుభాలు పొందుతారు. ఈ రాశివారు తరచూ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం వల్ల మరిన్ని మేలిమి ఫలితాలు కలుగుతాయి.

ధనస్సు (Sagittarius):
ఆదాయం – 2                       వ్యయం – 8
రాజపూజ్యం – 6                   అవమానం – 1

గతం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది. తెలివితేటలతో అన్ని కార్యాలనూ సిద్ధింప చేసుకుంటారు. వివిధ రకాల ఆదాయ మార్గాలను ఏర్పరచుకుంటారు. ధనాదాయం బాగా వృద్ధి చెందుతుంది. సుఖంగా, విలాసమయ జీవితాన్ని గడుపుతారు. ఆర్థిక స్థోమత పెరిగే కొద్దీ స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నూతన వాహనం కొనే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిమ్మల్ని దెబ్బతీసేందుకు శత్రువులు వేసే ఎత్తుగడలు మీకే లాభంగా మారతాయి. తొందరపాటుతో చేసే ఓ తప్పు వల్ల భారీగా నష్టపోయే వీలుంది. అప్రమత్తంగా ఉండండి. ఇళ్లకు దూరంగా ఉన్నవాళ్లు స్వస్థానానికి చేరుకుంటారు. జీవిత భాగస్వామి, సంతానం వల్ల సంతోషం కలుగుతుంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం ఆందోళన కలిగిస్తుంది. బంధువుల సహాయ నిరాకరణ వ్యవహారం ఆవేదనను కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. అనవసర గొడవలకు దూరంగా ఉండండి. ద్వితీయ వివాహ ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలమవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి ప్రతికూల సంవత్సరమనే చెప్పాలి. ఉద్యోగానికి భద్రత లోపించే వీలుంది. వ్యాపారంలోనూ అవరోధాలు, అధికారుల ఆగ్రహాల వల్ల నష్టాలు ఎదురవుతాయి. విద్యార్థుల ప్రతిభకు ఈ సంవత్సరం చక్కటి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు యోగదాయకమైన కాలం. మానసిక ప్రశాంతత సమకూరుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ధార్మిక, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. స్థూలంగా ఈ సంవత్సరం శుభఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశివారు ఈ సంవత్సరం, తరచూ వినాయకుడిని, నవగ్రహాలను ఆరాధించడం ద్వారా మరిన్ని మేలిమి ఫలితాలు పొందుతారు.

మకరం (Capricorn):
ఆదాయం – 5                       వ్యయం – 2
రాజపూజ్యం – 2                   అవమానం – 4

అప్రమత్తంగా ఉండాల్సిన కాలం. విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రతి పనికీ అడ్డంకులు ఎదురవుతాయి. చాలా పనులు పూర్తి కావు. సమయానికి డబ్బు సమకూరినా అవసరాలకు ఏ మాత్రం సరిపోదు. నామమాత్రపు సౌకర్యాలతో సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది. మీ తెలివితేటలు ఉపకరించవు. ఎన్ని శక్తియుక్తులు ప్రదర్శించినా విజయం సాధించలేక పోతారు. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోని కారణంగా ఇబ్బంది పడతారు. శత్రువుల కుట్రలకు బలయ్యే వీలుంది. వారి కదలికలను ఓ కంట కనిపెట్టుకుని ఉండండి. సన్నిహితులతోనూ గొడవలు వస్తాయి. మిత్రులు దూరమవుతారు. ఉత్సాహం సన్నగిల్లుతుంది. అపనిందలకు గురవుతారు. ముఖ్యమైన వారి ఎడబాటు కుంగదీస్తుంది. మానసిక భయాందోళనలు అధికం అవుతాయి. ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. జ్వరసంబంధ సమస్యలుంటాయి. నిరుద్యోగులు ఆశ వదులుకోకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి స్థానచలనం గోచరిస్తోంది. ఇష్టంలేని చోటికి బదిలీ కావడం, పైఅధికారుల వేధింపుల వల్ల, ఉద్యోగాన్ని వదులుకోవాలన్న ఆలోచన వస్తుంది. ఇది సరైన నిర్ణయం కాదు. వ్యాపారులకు నష్టంతో పాటు అప్పుల బాధ వేధిస్తుంది. మానసిక శాంతి కరువవుతుంది. వేళ తప్పిన భోజనం, త్రిప్పట సూచిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల్లో మాట తప్పిన ఫలితంగా కోర్టు మెట్లెక్కాల్సి రావచ్చు. ఫలితంగా మానసిక క్షోభ పెరుగుతుంది. దూర ప్రయాణాల వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. రెండో పెళ్లి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రతి చిన్న విషయంలోనూ కలహాలకు కాలుదువ్వే పరిస్థితి ఉంది. శారీరక సౌఖ్యం కలుగుతుంది. ఈరాశి వారు తరచూ శివారాధన, శనైశ్చరుడికి తైలాభిషేకం చేస్తూ ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది.

కుంభం (Aquarius)

ఆదాయం – 5                       వ్యయం – 2
రాజపూజ్యం – 5                   అవమానం – 4

మిశ్రమ ఫలితాలుంటాయి. పనులు అతి కష్టమ్మీద పూర్తవుతాయి. ముఖ్యమైన పనులు వదిలి, వ్యర్థ కార్యాలపై శ్రద్ధ చూపుతారు. అత్యధిక శ్రమకు అత్యల్ప ఫలితం దక్కుతుంది. మానసికంగా, శారీరకంగా తీవ్రంగా అలసిపోతారు. ధన సంపాదన ఉంటుంది. అయితే ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. పనులపై ఏకాగ్రతను కోల్పోతారు. మీ తెలివితేటలకు గుర్తింపు ఉండదు. పైగా బుద్ధి కూడా నిలకడగా ఉండదు. వీలైనంత వరకు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చక పోవడం ఉత్తమం. మీ చర్యలను బంధువులు విభేదిస్తారు. ఫలితంగా వారితో వైరం పెంచుకుంటారు. శత్రువులు, దాయాదుల కుట్రల వల్ల ఇబ్బందులు పడతారు. ప్రభుత్వం నుంచి కూడా చిక్కులు ఎదురవుతాయి. కొందరికి శిక్షలు పడే సూచనలూ ఉన్నాయి. ఆత్రుత పనికిరాదు. ఆచితూచి అడుగులు వేయాలి. కీర్తి ప్రతిష్టలకు భంగం రాకుండా చూసుకోవాలి. సమాజంలో మాట పలుకుబడిని నిలుపుకునేందుకు అమితంగా శ్రమించాలి. స్వస్థానానికి దూరంగా ఉండే పరిస్థితి గోచరిస్తోంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధర్మకార్యాచరణ కోసం సంపాదనను ఖర్చు చేస్తారు. శత్రువుల బెడద తగ్గుతుంది. వస్తు వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే, ప్రయాణాల్లో జాగ్రత్త. ముఖ్యంగా స్వయంగా వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. ఆత్మీయుల గురించిన ఓ వార్త కలవరాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల గురించి ముఖ్యంగా జీవితభాగస్వామి, సంతానం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండండి. వృత్తులు, వ్యాపారాలు, ఉద్యగాలు చేసుకునే వారికి కూడా మిశ్రమ ఫలాలే గోచరిస్తున్నాయి. సౌకర్యాలు కోల్పోయి సౌఖ్యానికి దూరమవుతారు. కోర్కెలు నెరవేర్చుకునే క్రమంలో మనోధైర్యాన్ని వదులుకోకండి. ఈరాశివారు తరచూ పార్వతీపరమేశ్వరులను, నవగ్రహాలను ఆరాధించడం వల్ల మేలిమి ఫలితాలు కలుగుతాయి.

మీనం (Pisces):
ఆదాయం – 2                     వ్యయం – 8
రాజపూజ్యం – 1                  అవమానం – 7

ఈ సంవత్సరం కాస్తంత అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రథమార్థంలో ధనలాభం, అధికార వృద్ధి వంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సంఘంలో హోదా పెరుగుతుంది. చాలా గొప్ప గౌరవాన్ని పొందుతారు. ఐశ్వర్యాన్ని వృద్ధి చేసుకుంటారు. దేహ సౌఖ్యాన్ని పొందుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. శుభకార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. దీర్ఘవ్యాధులు మిమ్మల్నేమీ చేయలేవు. అయితే, బద్దకం కారణంగా వ్యర్థ పనుల వైపు మొగ్గు చూపే వీలుంది. లేనిపోని చింతలతో దుఃఖాన్ని ఆహ్వానిస్తారు. కార్యాలు ఎంచుకునేటప్పుడు విజ్ఞతను ప్రదర్శించండి. ఆస్తి సంబంధ భయం వెంటాడుతుంటుంది. ఉన్నచోటు వదిలి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి రావచ్చు. కీలకమైన పనుల కోసం జరిపే ప్రయాణాలు అంతగా అనుకూలించవు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు అధికారుల నుంచి ఒత్తిళ్లు తప్పవు. వీరికి వివిధ రూపాల్లో కష్టాలు మీదపడుతుంటాయి. కొందరు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావచ్చు. రహస్య శత్రవుల ముప్పేట దాడి వల్ల అప్రతిష్టల పాలవుతారు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఉద్యోగాలకు, రాజకీయ నాయకులు తమ పదవులకు రాజీనామా చేయాల్సి రావచ్చు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామి, సంతాన సంబంధ అనారోగ్యాలు ఆందోళనను కలిగిస్తాయి. విద్యార్థులు చక్కటి ప్రతిభను కనబరుస్తారు. అనుమానాలు పెట్టుకోకుండా, ఉత్సాహంతో ముందుకు సాగండి. ఎక్కడా మీ బలహీనతలను బయటపెట్టకండి. సోదర వర్గంతో సఖ్యత లోపించే సూచనలున్నాయి. పెద్దల ఆగ్రహానికి గురవుతారు. అవమానాల పాలవుతారు. ఇది మనసుకి కష్టం కలిగిస్తుంది. ఈరాశివారు తరచూ గాయత్రీమాత, నవగ్రహాలను ఆరాధిస్తే మరిన్ని మేలిమి ఫలితాలు కలుగుతాయి. .

గమనిక :
2022లో గ్రహాల సంచారాన్ని అనుసరించి, ఆయా రాశులపై వాటి ప్రభావాన్ని అంచనా వేసి రాసిన ఫలితాలివి. వ్యక్తిగతమైన ఫలితాల కోసం, మీ జన్మకుండలి ద్వారా, నడుస్తున్న దశ, అంతర్దశలను, గోచారంతో బేరీజు వేసుకుని నిర్దిష్టమైన ఫలితాలు తెలుసుకోగలరు.

శుభం భూయాత్

పి.విజయకుమార్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్