Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకవితత్వ విచారం

కవితత్వ విచారం

ఆంధ్రజ్యోతి సాహితీ పేజీలో మొలకలపల్లి కోటేశ్వరరావు ఒక వ్యాసం రాశారు. కవిత్వం పుస్తకాలు ప్రచురించాలనుకునే కవులకు జాగ్రత్తలు చెప్పారు. హెచ్చరికలు చేశారు. మంచి సూచనలు చేశారు.కవికుల శ్రేయోభిలాషిగా కవిత్వ సంకలనాల ముద్రణలో ఉన్న కష్ట నష్టాలను కళ్లకు కట్టినట్లు వివరించారు. కవిత్వం యాభై పుస్తకాలు అమ్ముడుపోతే గొప్ప కవే అన్న శీర్షికతో ఉన్న ఈ వ్యాసం కవులు లేదా కవులం అని తమకు తాము అనుకునే వారందరూ తప్పక చదవాలి. నిజమే-
కవిత్వం పుస్తకాలు అమ్ముడుపోయే రోజులు కావివి.

గ్రూపు కవులు:-
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందరూ కవులే. ప్రతి వాట్సాప్ గ్రూపులో పది మంది కవులు పొద్దున్నే తమ కవిత్వాలతో మిగతా బృంద సభ్యులను బలాత్కారం చేస్తుంటారు. వీరి కవిత్వంతోనే గ్రూపులకు పండగలు వస్తుంటాయి. ప్రత్యేక దినాలకు వీరి కవిత్వ తద్దినాలే దిక్కు. వృక్షాలులేని చోట ఆముద వృక్షమే మహా వృక్షం అన్నది ప్రమాణం కాబట్టి…కొంతకాలానికి గ్రూపు బయట కూడా వీరికి కవిగా గుర్తింపు వస్తుంది. వెంటనే ఒక జుబ్బా, లాల్చీ కుట్టించుకోవాల్సి వస్తుంది. నడక, మాట, రాత అన్నీ మారిపోతాయి. ఈ అజ్ఞానాంధకార లోకానికి కవిగా తను వెలుగులు పంచాల్సిన అవసరముందని అనిపిస్తుంది. ఆపై అతడి/ఆమె పగ, ప్రతీకారాలు మన ప్రారబ్దానికి అనుసంధానమైపోతాయి.

వర్చువల్ కవులు:-
మామూలుగానే కవి సమ్మేళనాల్లో కవి తుపాకి గుండుకు ఒక్కరు దొరకరు. కరోనా తరువాత కవి సమ్మేళనాలకు అవకాశమే లేదు. అయితే కవి ఊరుకోడు. వదిలిపెట్టడు. జూమ్ లు, వీడియో, ఫేస్ బుక్ లైవుల్లో వర్చువల్ గా సమ్మేళనాలు జరుగుతున్నాయి. బయట మైకు దొరకని ఎందరో కవులకు వర్చువల్ వేదికలు అవకాశం కలిగించాయి.

ప్రాస కవులు:-
చివరి అక్షరం ప్రాస దొరికితే చాలు. రెచ్చిపోవచ్చు. నిజానికి మొదట చివరి ప్రాస అక్షరమే రాసి అటునుండి వెనక్కు పదాలు పేర్చుకుంటూ రావడమే ఆధునిక ప్రాస కవి లక్షణం.

యాస కవులు:-
ఎవరి యాస వారికి గొప్పది. మాండలిక యాసలో ఎలా మాట్లాడుతున్నామో అలాగే రాసేవారు యాస కవులు.

ప్రయాస కవులు:-
వీరు రాయడానికి ప్రయాస పడతారు. మనల్ను ప్రయాస పెడతారు. వారిది కవిత్వ ప్రయాస. మనకు వృథా ప్రయాస.

పుట్టు కవులు:-
పుట్టు గుడ్డిలా కొందరు పుట్టుకతోనే కవులుగా పుడతారు. అది జన్యుగత విశేషం.

తిట్టు కవులు:-
వీరు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ…అదే కవిత్వమని అనుకోమంటారు.

వాద కవులు:-
ఎవరి వాదానికి తగిన వాదం ఇందులో ప్రధానం. కవిత్వం ఉంటేఉండవచ్చు. లేకపోతే వెతుక్కోవాలి. వాదమే ముఖ్యం.

రౌడీ కవులు:-
వీరు వీధిరౌడీలకంటే ప్రమాదం. అంగబలం, అర్థ బలం, కండబలాలతో కవిత్వాన్ని చెరపడతారు. మనం కాదనలేని నిస్సహాయులం అయిపోతాం.

దొంగ కవులు:-
వీరు ఇతరుల కవిత్వాన్ని దొంగిలించి తమదిగా చెప్పుకుంటూ ఉంటారు. లేదా వృత్తిగా దొంగతనం చేపట్టినవారు ఎవరయినా కవిత్వం రాస్తే…వారు అక్షరాలా దొంగ కవులే అవుతారు.

నకిలీ కవులు:-
కవికాకపోయినా కవిగా చాలామణి అయ్యేవారు.

అవార్డు కవులు:-
వీరు అవార్డులకోసమే రాస్తుంటారు. రాసి అవార్డుల కోసమే తిరుగుతూ ఉంటారు.

కవి వృషభాలు:-
కవి కేసరి, కవి సింహం, కవి శార్దూలం, కవి మత్తేభం, కవి వ్యాఘ్రం ఇలా కవి రూపాంతరం చెంది అనేక జంతు జాతుల్లో చేరిపోతాడు. ఇదొక కవి జీవ పరిణామ క్రమ సిద్ధాంతం.

ప్రభుత్వ కవులు:-
వీరు ప్రభుత్వ భజనలో తరిస్తుంటారు.

ఎడమ కవులు:-
ఇది కవి చూపుకు సంబంధించిన విషయం. ఒక్క ఎడమ కన్నే పని చేస్తుంది వీరికి.

కుడి కవులు:-
వీరికి కుడి కన్ను ఒక్కటే పని చేస్తుంది.

పాఠకులకు ఇన్సూరెన్స్:-
ఈ మధ్య ఎన్నెన్నో వినూత్న ఇన్సూరెన్స్ పాలసీలు, విధానాలు మార్కెట్లోకి వచ్చాయి. కవిత్వం చదివే, వినే, చూసేవారికి మాత్రమే కవర్ అయ్యే పొయెటిక్ జస్టిస్ పాలసీలు రావాల్సిన అవసరం ఎంతయినా ఉంది.

మనిషివా? కవివా?
కవులు ఎన్ని రకాలు అన్న ప్రశ్నకు కవికులగురువు కాళిదాసే మళ్లీ పుట్టినా…ఆదికవి వాల్మీకి మళ్లీ అవతరించినా చెప్పలేరు. ఏ కవికి ఆ కవి ప్రత్యేకం. ఒక కవికి ఇంకో కవితో అస్సలు పడదు. కాబట్టి లోకంలో ఉన్న కొన్ని కోట్ల మంది కవులు ఎవరికి వారే ఒక వర్గం. వారిది ఒక స్వర్గం. ఇంకొకరు దాటలేని దుర్గం!

ఉపసంహార కవిత్వం:-
కవిత్వమొచ్చినా…
కక్కొచ్చినా…ఆగదు. అలాంటిది కవిత్వమే కక్కుగా వస్తే…ఆపగలిగిన క్రస్ట్ గేట్లు ఎక్కడ ఉంటాయి? ఉన్నా ఎలా సరిపోతాయి?

మొలకలపల్లి కోటేశ్వరరావుగారు ఆశాజీవి. కవులు ఆర్థికంగా నష్టపోకూడదని కోరుకుంటున్నారు. డబ్బులు పోగొట్టుకునేవాడే కవి. కవి ప్రాథమిక లక్షణాన్ని, స్వభావాన్ని మార్చుకుంటాడా?

కత్తిపట్టిన ప్రతివాడూ వీరుడూ కాదు.
కలం పట్టిన ప్రతివాడూ కవీ కాదు.

కవిది మరో ప్రపంచం.
పాఠకుడిది ఇంకో ప్రపంచం.
భిన్న ధ్రువాలు ఎప్పటికీ ఆకర్షించుకోలేవు. పరస్పరం వికర్షించుకోవాల్సిందే!

కవి అమ్ముడుపోవచ్చు. అమ్ముడుపోకపోవచ్చు. కానీ…కవి కవిత్వం మాత్రం ఎప్పటికీ అమ్ముడుపోదు!

-పమిడికాల్వ మధుసూదన్

Must Watch:

Also Read:

నో బుక్

Also Read:

లిపిని చంపుదాం రండి

RELATED ARTICLES

Most Popular

న్యూస్