Telugu Language Day : 

తెలుగుని రక్షించాలి
తెలుగుని కాపాడాలి.
తెలుగువాడిగా పుట్టినందుకు గర్వపడాలి.
ఏంటో ఇదంతా!
మన కులం,
మన మతం,
మన వంశం,
మన రక్తం..
మనకున్న అనేక ఫ్యూడల్ గర్వాలకు భాష కూడా తోడైందేమో అనిపిస్తుంది.

ఒక వత్తు పలక్కపోతే,
ఒక దీర్ఘం సరిగ్గా వినపడకపోతే..
భాషను ఖూనీ చేసేస్తున్నారంటాం…
తెలుగులో ఇంగ్లీషో మరొకటో కలిస్తే, సంకరం అంటాం.
ఏది అసలు తెలుగు?
ఏది ప్రామాణికం?
ఏది వాడుక?
ఏది వాచ్యం?
ఏది రచన?
ఇదో సిద్ధాంత చర్చ..
దీని మీద పరిశోధనలు చేసారు.
గ్రంధాలు రాసారు.
ఆ జోలికి వెళ్ళను.

అసలు భాష అనే పదమే తెలుగు కాదు కదా!
తెలుగు భాషలో తెలుగెంత?
సంస్కృతం ఎంత?
తమిళం ఎంత?
మరాఠీ , ఉర్దూ, కన్నడ, ఫ్రెంచ్, లాటిన్ ..
ఏయే భాషల వాటాలెంత?
ఆ లెక్కలు కూడా అంత ఈజీగా తేలేవి కాదు.
కాకపోతే,
భాషను కాపాడడం అనేదే నాకు అర్థం కాదు.
ఏభాషనైనా ఎవరైనా కాపాడగలరా?
కాపాడడం అంటే, కోల్డ్ స్టోరేజిలో దాచిపెట్టడమా?
నన్నయో, తిక్కనో రాసిన తెలుగే ఇప్పుడు వుందా?
ఆ తెలుగుని అలాగే ఉంచితే తెలుగుని కాపాడినట్టు అయ్యేదా?
అవసరమే కదా దేన్నైనా నడిపించే ఇంధనం!
చెల్లుబాటుతోనే కదా దేనికైనా విలువ!
అనుసరణ లేకుండా మనుగడ సాధ్యమేనా?
గాల్లో వెలగని దీపం.. అసలు గాలే లేకపోతే ఆరిపోతుంది.
భాషైనా అంతే,
సజీవంగా వుండాలంటే, వీలైనంత సంకరం కావల్సిందే.

అసలు అచ్చమైన తెలుగుభాష ఒకటుందా?
ప్రతిపది కిలోమీటర్లకి ఒక మాండలికం మారుతుంది.
ప్రతి కులానికి ఒక నుడికారం వుంటుంది.
ఏ ప్రాంతం భాషని కాపాడాలి?
ఏ కులం భాషని కాపాడాలి?
పదేళ్ళ కిందట చేసిన్రు, వచ్చిన్రు అని ఏ సబ్ ఎడిటర్ అయినా రాయగలిగేవాడా?
రాస్తే సీనియర్లు ఊరుకునేవాళ్ళా?
ఇవాళ తెలంగాణ మీడియా తన భాషను , యాసను కిరీటంలా ధరిస్తోంది.
పదేళ్ల క్రితం తప్పులన్నీ ఇప్పుడు ఒప్పులైపోలేదా!
మరి మనం ఇప్పుడు ఏ తెలుగు భాషని కాపాడాలి?
పోనీ ఎవరికి తోచింది వాళ్ళు కాపాడండి అంటారేమో.
కాపాడడం అంటే ఏంటి?

ఇతర భాషల పదాలను త్యజించడమా?
అవసరం మేరకు ఏ భాషా పదాన్నైనా మన భాషలో కలిపేసుకోవడమా?
రోడ్డు, పోలీసు, రైలు, ట్రైను, సిగ్నలు, ఫాను, కారు, బస్సు, బోటు, డాక్టరు, నర్సు, డ్రమ్ము, తారు, సిమెంటు, గ్లాసు, సారు, టీచరు, మాస్టారు,
వీటిలో కొన్నిటికి తెలుగులో పదాలున్నాయి.
కొన్నిటికి ఇంగ్లీషు పదాలే తెలుగైపోయాయి.
ఇంగ్లీషు పదాలు తెలుగైన చోట తెలుగు నష్టపోయినట్టా? లాభపడినట్టా?
ఎన్ని సంస్కృతుల్ని మనలో ఇముడ్చుకోగలిగితే, మన సంస్కృతి అంత విస్తరిస్తుంది కదా!
భాష మాత్రం అతీతమా?
ఎన్ని భాషల పదాలమీద తెలుగు ముద్రేసుకోగలిగితే, తెలుగు రిలవెన్స్ అంత పెరుగుతుంది.
ఇప్పుడంటే, నర్సరీ నుంచే అందరూ ఇంగ్లీషు భాషలోనే చదువు నేర్చుకుంటున్నారు.
నాలాంటి వాళ్ళు పదొతరగతి వరకు తెలుగు లో చదివినా.. ఆ తర్వాత అతికష్టం మీద ఇంగ్లీష్ కి మారాల్సి వచ్చేది.
ముఖ్యంగా సైన్స్ గ్రూపుల పిల్లలకి ఇది ఇంకా కష్టం.
అయినా ఎందుకు మారతారు?

అక్కడి నుంచి వచ్చే జార్గన్ కి తెలుగు లో పదాలు లేవు.
అయితే, కృతకంగా తెలుగుచేసిన పదాలు నేర్చుకోవాలి.
మళ్లీ వాటికి ఇంగ్లీష్ లో ఏమంటారో కూడా తెలుసుకోవాలి.
ఈ బాధంతా ఎందుకని కష్టమో నష్టమో ఇంగ్లీష్ మీడియం కి మారిపోతున్నారు.
ఇది కేవలం అకడెమిక్స్ కే సంబంధించిన పని కాదు.
మొత్తంగా భాష తన దారిని తనని వెతుక్కోనివ్వాలి.
అలా కాకుండా భాషకి గిరిగీసి.. బలవంతపు అనువాదాలతో ఇనుపగోడలు కడితే ప్రయోజనం వుంటుందా?
అనేక ఏర్లు, సెలయేళ్లు నదిలో కలిసినట్టు,
ఎన్నిభాషల పదాల్నైనా ఇముడ్చుకునే శక్తి ప్రతిభాషకి వుంటుంది. వుండాలి.
ప్రపంచంలో ఎక్కువ భాషల్ని తనలో కలుపుకుని ఇంగ్లీష్ ఎక్కువ దేశాల్లో రాజ్యం చేస్తోంది.
తెలుగైనా అంతే,
పనికట్టుకుని పరభాషా పదాల్ని తెలుగు చేయడం ఒక పాతబడిన విద్య.
ఆ పదాలు అలాగే తెలుగైపోవడం ఒక సహజపరిణామక్రమం.

ఇంటర్నెట్ ని అంతర్జాలం చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
కానీ, తెలుగులో కూడా ఇంటర్నెట్ అని రాసేస్తే, వచ్చే తరాలు దాన్నొ తెలుగుపదంలాగే వాడేస్తాయి.
ఆ రకంగా భాషని భవిష్యత్తుకి సిద్ధం చేసినవాళ్లమవుతాం.
ప్రపంచానికి చేరువచేసిన వాళ్ళమవుతాం.
భావం శబ్దమై, శబ్దం పదమై, పదాలు భాషగా మారిన
శతాబ్దాల చరిత్ర ఏ కొద్దిమందో కూర్చుని రాసింది కాదు.
చేసిన అనువాదమూ కాదు.
కాలంతో భాషని సాగనివ్వండి. మారనివ్వండి, ఎదగనివ్వండి..
ఇవేమీ జరగకుండా అడ్డుపడకండి..
దాన్నే కాపాడడం అనుకోకండి.

-కే.శివప్రసాద్

Also Read: కలుపు మొక్కలు, చిప్ప కాఫీల వికటనలు!

Also Read: తెలుగుకు బూజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *