Friday, June 12, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసువర్ణ రోగంతో ఏర్పడ్డ సంధి

సువర్ణ రోగంతో ఏర్పడ్డ సంధి

సవర్ణదీర్ఘసంధి సంస్కృతానిది. ఏది తెలుగో, ఏది సంస్కృతమో తెలియనంతగా పెనవేసుకుపోయి ఉంటాయి కాబట్టి ఆ చర్చ ఇక్కడ అనవసరం. అత్యంత సరళమైనది, సులభమైనది, సహజమైనది సవర్ణదీర్ఘసంధి. అలాంటి సవర్ణదీర్ఘసంధికి ఇలాంటి చెప్పుకోలేని కష్టం వస్తుందని సంస్కృత వ్యాకరణం రాసి పెట్టిన పాణిని కానీ, తెలుగుకు వ్యాకరణదీపం చిన్నదే అయినా చాలా పెద్ద బాలవ్యాకరణం రాసి పెట్టిన పరవస్తు చిన్నయసూరి కలలో కూడా అనుకుని ఉండరు!

సవర్ణదీర్ఘ సంధి సూత్రం?
“ఓక పేద కుటుంబానికి చెందిన సువర్ణ అనే అమ్మాయికి దీర్ఘకాలిక వ్యాధి అయిన డయాబెటిక్స్ తో బాధపడుతూ ఉండేది. వాళ్ళ నాన్న తాగుబోతు అవ్వడంతో వైద్యానికి డబ్బులు లేక, వాళ్ళ ఇంటిపక్క సంధులో ఉన్న ఒక ముసలావిడ సహాయంతో ఆ వ్యాదికి మందును కనిపెట్టింది. అప్పటినుండి ఆ సంధుని సువర్ణదీర్ఘ సందు అని పిలిచేవారు. కాలక్రమేన అది సవర్ణదీర్ఘసంధిగా మారింది”

తెలుగు పరీక్షలో ఒక ఉన్నతపాఠశాల విద్యార్ధి రాసిన సమాధానంగా ఇది వైరల్ గా తిరుగుతోంది. నిజంగా జరిగిందో లేక సోషల్ మీడియాలో ఎవరైనా పుట్టించి వైరల్ చేశారో తెలియదు కానీ…ఇందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.

ఓక పేద;
సువర్ణ;
వ్యాది;
సంధులో;
కాలక్రమేన…లాంటి ఎన్నెన్నో మణిమాణిక్యాల మధ్య సువర్ణ కాస్త సవర్ణ దీర్ఘం కావడంలో ఔచిత్యం మాత్రం ఉంది!

ప్రస్తుతం తెలుగుకు కరువు కాలం. కాలక్రమంలో తేలికైన సవర్ణదీర్ఘసంధికే ఇంతటి జబ్బు చేస్తే…సంక్లిష్టమైన ఆమ్రేడిత, ద్విరుక్తటకార, అనునాసిక, గసడదవాదేశ, కర్మధారయ, పుంప్వాదేశ, టుగాగమ సంధులకు వైద్యం చేయడానికి వీలుకాని ఇంకెన్నెన్ని జబ్బులు చేస్తాయో!

ఈ సువర్ణ వాళ్ళ ఇంటిపక్కనున్న ఆ ముసలావిడ నాటు వైద్యమే ఇక అన్ని తెలుగు సంధులకు దిక్కూ మొక్కూ!!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular