Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతెలుగు తెరపై ఎదురులేని రారాజు .. ఎన్టీఆర్ 

తెలుగు తెరపై ఎదురులేని రారాజు .. ఎన్టీఆర్ 

నందమూరి తారక రామారావు..
తెలుగు తెరపై ఈ పేరు ఓ మలయమారుతం..
ఓ మేరుపర్వతం.
తెరనిండుగా పరుచుకున్న తెలుగుదనం.
తెలుగు సినిమాను గురించి చెప్పుకోవాలంటే ఎన్టీఆర్ కి ముందు..
ఎన్టీఆర్ కి తరువాత అనే చెప్పుకోవాలి.
ఆయన పేరును ప్రస్తావించకుండా తెలుగు సినిమాను గురించి మాట్లాడుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు.

అంతగా ఆయన తెలుగు సినిమాను ప్రభావితం చేశారు. ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగానే తమకి సరైన కథానాయకుడు దొరికాడని చెప్పేసి కథలన్నీ కూడా పులకించిపోయాయి. సాంఘికాలతో పాటు జానపద.. పౌరాణిక.. చారిత్రక కథలు ఆయన చేయి పట్టుకుని ఉత్సాహంతో ఉరకలు పెట్టాయి.


కాలేజ్ రోజుల్లోనే ఎన్టీఆర్ నాటకాల పట్ల ఆసక్తిని చూపుతూ వచ్చారు. ఆ తరువాత స్నేహితుల ప్రోత్సాహంతో ఆయన సినిమాల దిశగా అడుగులు వేశారు.

చెన్నై లో చిన్నగదిలో అద్దెకి ఉంటూ నెల జీతంపై సినిమాలు చేశారు. ముందుగా ‘పల్లెటూరి పిల్ల’ సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ, షూటింగు మొదలు పెట్టుకున్నదీ.. థియేటర్లకు వచ్చింది ‘మనదేశం’ సినిమానే. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను చూసినవాళ్లు, కనుముక్కుతీరు చక్కగా ఉందని అనుకున్నారు. ‘షావుకారు’ సినిమాలో ఆయన వాయిస్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆ సమయంలోనే ఆయన ‘పాతాళ భైరవి’ చేశారు.

తెలుగు జానపదాల్లో ‘పాతాళభైరవి’ స్థానం ఎప్పటికీ చెక్కుచెదరదు.. ఆ కథాకథనాల్లో బలం అలాంటిది. ఈ సినిమాతో ఎన్టీఆర్ ఇక వెనుదిరిగి చూసుకోలేదు. సాధారణంగా ఆకర్షణీయమైన రూపం ఉన్నవారికి స్వరం బాగుంటుందని చెప్పలేం. స్వరం చక్కగా ఉన్నవాళ్లు అందంగా ఉంటారనీ చెప్పలేం. అదృష్టం బాగుండి ఈ రెండూ బాగుంటే నటనలో రాణిస్తారని చెప్పలేం. ఒకవేళ నటన వచ్చినా జానపద .. పౌరాణికాలలో మెప్పించే ఆహార్యం ఉంటుందని చెప్పలేం.

కానీ ఏ విషయంలోను వంకబెట్టలేని పున్నమి చంద్రుడిలా ఎన్టీఆర్ వెండితెరపై వెలుగులు వెదజల్లారు.

తొలినాళ్లలోనే ఆయనకి కథాబలమున్న సినిమాలు పడటం విశేషం. ‘పాతాళభైరవి’.. ‘మల్లీశ్వరి’ సినిమాలు రథచక్రాలుగా ఆయన కెరియర్ ను పరుగులు తీయించాయి. ఈ సినిమాలకు ‘మాయాబజార్’ కూడా తోడుకావడంతో, ఇక ఎన్టీఆర్ ను ఆపడం.. అందుకోవడం ఎవరికీ సాధ్యం కాలేదు. ‘మాయాబజార్’లో .. ‘శ్రీకృష్ణార్జున  యుద్ధం’లో కృష్ణుడిగా.. ‘లవకుశ’లో రాముడిగా.. ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ వేంకటేశ్వరస్వామిగా ఎన్టీఆర్ నీరాజనాలు అందుకున్నారు.

తెరపై దేవుడిని చూసినట్టుగానే ప్రేక్షకులు దణ్ణాలు పెట్టేశారు. అంతగా ఆయన ఆ పాత్రల్లో కుదిరిపోయారు.. ఒదిగిపోయారు.


రామాయణ భారతాల్లో నెగెటివ్ షేడ్స్ తో కనిపించే రావణ.. దుర్యోధన.. కర్ణ పాత్రలను ధరించడానికి రామారావు సిద్ధపడటం ఒక సాహసమైతే, ఆ పాత్రల్లో సైతం ఆయన ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకోవడం విశేషం.ఆ పాత్రల్లోని కొన్ని మంచి లక్షణాలను తెరపై ఆయన ఆవిష్కరించిన తీరును గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు.
అంతేకాదు ‘నర్తనశాల’లో బృహన్నలగా కనిపించడానికి వెనుకాడకపోవడం ఆయన ధైర్యానికి ఒక మచ్చుతునకగా కనిపిస్తుంది. ఇక కృష్ణదేవరాయలు పేరు వింటే ఎవరి కళ్లముందైనా కనిపించేది ఎన్టీఆర్ రూపమే.

పౌరాణిక పాత్రల్లో నిండుగా.. నిదానంగా.. నిబ్బరంగా ఎన్టీఆర్ నడిచే తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక జానపదాల్లోకి వచ్చేసరికి ఆయన చాలా యాక్టివ్ గా కనిపించేవారు. జానపద గీతాల్లో ఒంటికాలుతో ముందుకు గెంతే తీరు  అభిమానులకు విపరీతంగా నచ్చేది.

ఇక కథానాయికల కళ్లలోకి కాకుండా నుదురు వైపు చూస్తూ మాట్లాడటం ఎన్టీఆర్ కి అలవాటు. ఒక్కోసారి ఆయన గ్లామర్ ముందు హీరోయిన్ల గ్లామర్ సైతం తేలిపోయేది. ఎన్టీఆర్ లాంటి విగ్రహం .. అలాంటి డైలాగ్ డెలివరీ.. ఆ తేజస్సును మరే భాషలోను చూడలేము అనడంలో అతిశయోక్తి లేదు.

70వ దశకం ద్వితీయార్థం నుంచి ట్రెండు మారిపోయింది. అప్పటివరకూ ఒక విధమైన బాడీ లాంగ్వేజ్ కి అలవాటుపడిపోయిన ఎన్టీఆర్, కొత్త జనరేషన్ ను అందుకోవడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథలను ఎంచుకుంటూ వెళ్లారు. సాంఘిక చిత్రాలలో కొత్త ఒరవడిని అందుకోవడం కాదు.. ఆ ఒరవడి తనని ఫాలో అయ్యేలా చేసుకున్నారు. ‘అడవిరాముడు’.. ‘డ్రైవర్ రాముడు’..  ‘వేటగాడు’.. ‘యమగోల’ వంటి సినిమాలు, అవి సాధించిన విజయాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి.

80వ దశకంలో వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’.. ‘కొండవీటి సింహం’.. ‘జస్టీస్ చౌదరి’.. ‘బొబ్బిలి పులి’ వంటి సినిమాలు సంచలన విజయాలకు సరిహద్దులా నిలిచాయి. ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా సాధించిన వసూళ్లు..

90వ దశకంలోను ఆయన చరిష్మా తగ్గలేదని నిరూపించాయి. వేషాలు లేక ఎన్టీఆర్ సాయం కోసం ఆయన దగ్గరికి వెళ్లిన ఆర్టిస్టులు నిరాశతో వెనుదిరిగిన సందర్భాలు లేవని చెబుతారు. తనకంటే వయసులోను .. అనుభవంలోను చిన్నవారిని కూడా గౌరవించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనం.

ఎన్టీఆర్ 300లకి పైగా సినిమాలు చేసినా ఏ సినిమా షూటింగుకు కూడా ఆయన ఆలస్యంగా వెళ్లిన దాఖలాలు లేవు. నిర్మాతలకు ఇచ్చిన సమయంలో తన సొంత పనులు చేసుకోవడం ఆయనకి అలవాటు లేదు. శోభన్ బాబును నిలబెట్టడమే కాదు.. హరనాథ్, చలం వంటివారిని కూడా ఆదుకోవడనికి ఆయన తనవంతు ప్రయత్నం చేశారని అంటారు.

ఏఎన్నార్.. కృష్ణ.. కాంతారావు వంటివారితో మల్టీ స్టారర్లు చేశారు. దర్శక నిర్మాతగా అభిరుచి కలిగిన సినిమాలను అందించారు. ఆ తరువాత రాజకీయాలకి వచ్చిన ఆయన, అక్కడ కూడా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.

క్రమశిక్షణకు.. సమయపాలనకు ఎన్టీఆర్ ఎంతో ప్రాధాన్యతను ఇచ్చేవారు. ఆయనలో పట్టుదల.. కార్యదీక్ష కూడా ఎక్కువ. ఏ పనిని మొదలుపెట్టినా, దానిని పూర్తిచేసేవరకూ ఆయన విశ్రమించేవారు కాదు.

<ఆయన అంకితభావమే ఆయనకి అన్నేసి విజయాలను సాధించి పెట్టింది.. అశేష ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. తెలుగు తెరపై నవరస నట ప్రభంజనమై సాగిన ఎన్టీఆర్ ను ఎవరూ ఎప్పటికీ మరిచిపోలేరు.. ఆయన పౌరాణికాలు చూస్తున్నప్పుడు ఔరా! అని అనుకోకుండా ఉండలేరు. ఎన్టీఆర్ అంటే ఎదురులేని అభినయం.. తిరుగులేని ప్రయాణం.. అంతే!

(మే, 28- ఎన్టీఆర్ జయంతి – ప్రత్యేకం)

— పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్