Sunday, November 24, 2024
HomeTrending NewsAP Politics: పొత్తు పేరుతో చిత్తు చేయటమే బాబు ఎత్తుగడ?

AP Politics: పొత్తు పేరుతో చిత్తు చేయటమే బాబు ఎత్తుగడ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొద్దిరోజులుగా వేడెక్కుతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి తదనంతరం తెలుగుదేశం పార్టీ నేతల్లో జోష్ వచ్చింది. అందుకు తగ్గట్టుగానే విజయనగరం జిల్లాలో పార్టీ  సభ సక్సెస్ అయింది. రాబోయేది తమ ప్రభుత్వమే అన్నట్టుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ప్రసంగాలు సాగుతున్నాయి.

తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఒకే అన్నట్టుగా పైకి కనిపిస్తున్నా… లోతుగా పరిశీలిస్తే రెండు పార్టీల నేతల మధ్య అంతరాలు, భేదాభ్రిప్రాయాలు ఉన్నాయని తెలుగు తమ్ముల్లే విసుక్కుంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో సీట్ల సర్దుబాటు, ఓట్ల బదిలీ రెండు పార్టీలకు తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి.

మొదటి నుంచి కొంత బలంగా ఉన్న ఉత్తరాంధ్రలో టిడిపి ఎక్కువ సీట్లు కోరే అవకాశం ఉంది. మారిన రాజకీయ సమీకారణాల రిత్యా జనసేన ఉత్తరాంధ్రపై ఫోకస్ చేస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏ పార్టీ ఏర్పాటు చేస్తుందనేది గోదావరి జిల్లాల్లో వచ్చిన స్థానాలతోనే ఖరారు అవుతుంది. ఈ నేపథ్యంలో జనసేన కోరిన సీట్లు టిడిపి ఇస్తుందా అనే అనుమానం రెండు పార్టీల నేతల్లో ఉంది.

రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరిగినా… ఓట్ల బదిలీ విషయానికి వస్తే అంత సులభం కాదనే వాదన ఉంది. పవన్ కళ్యాన్ -చంద్రబాబుతో అంటకాగటం కాపు మేధావులు, యువతకు సుతారం ఇష్టం లేదు. కాపు ఐకాన్ గా చెప్పుకునే వంగవీటి మోహన రంగ హత్య కుట్రదారులు కమ్మ సామాజిక వర్గం వారేనని వీరిలో బలమైన అభిప్రాయం ఉంది.

తెలంగాణ కూకట్ పల్లి శాసనసభ స్థానంలో జనసేనకు కమ్మ సామాజిక వర్గం మద్దతు ఇవ్వలేదని, కాంగ్రెస్ నుంఛి పోటీ చేసిన ఆ వర్గం నేతనే బలపరిచారని…పొత్తు ధర్మం విస్మరించారని విమర్శలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో కాపుల ఓట్లు జనసేన కు వచ్చినా టిడిపి మద్దతుదారుల ఓట్లు పడలేదని పార్టీ నేతలకు నివేదికలు అందాయి. పోలింగ్ బుత్ ల వారిగా పవన్ కళ్యాన్ కు పార్టీ నేతలు వివరించారని సమాచారం.

కాపు – కమ్మ సామాజిక వర్గాల మధ్య ఉన్న విభేదాల దృష్ట్యా కాపులు వైసీపి వైపు మొగ్గు చూపకుండా వేసిన ఎత్తుగడే జనసేన ఆవిర్భావమని కాపు మేధావులు భావిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం ఆవిర్భావం… అది నిలదోక్కుకుండా జరిగిన మంత్రాంగం…తెర వెనుక కుట్రదారులు ఎవరో కాపులు గ్రహించారు.

ఇప్పుడు అదే రీతిలో జనసేనను అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని…అందులో భాగమే నాదెళ్ళ మనోహర్ పార్టీలో కొనసాగటమని కాపు పెద్దల్లో అనుమానాలు ఉన్నాయి. వ్యవస్థాగతంగా పార్టీ నిర్మాణం చేయని, అసలు ఆ అంశమే పట్టని పవన్…తరచుగా తన ప్రసంగాలలో కాపులు తనవైపు ఉండటం లేదని ఆక్రోశం వెల్లగక్కుతారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయంగా పవన్ ఒడిదుడుకులు ఎదుర్కుంటే… ఈవర్గం వారికి రాజకీయం, పార్టీ నిర్వహణ చేతకాదని నిరూపించేందుకు చంద్రబాబు వర్గం యత్నిస్తోందని ఆరోపణలు ఉన్నాయి. చిరంజీవి ఆ తర్వాత పవన్ విఫల రాజకీయాలతో కాపులు ఎన్నటికి నిలదోక్కుకొండా చేయటమే బాబు ఎత్తుగడ అని జనసేన అంతరంగిక చర్చల్లో అనుకుంటున్నారు.

ఇవేవి తనకు సంబందం లేదన్నట్టుగా టిడిపితో పొత్తు ఉంటుందని పవన్ తెగేసి చెపుతున్నారు. పొత్తు నచ్చని వారిది గోదారి అన్నట్టుగా ఆయన వ్యవహారశైలి ఉంది. భవిష్యత్తు ఏంటో అర్థం కాక జనసేన నేతలు తలలు పట్టుకుంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్