తెలుగుదేశం తొలి జాబితాలో చోటు దక్కని కొందరు నేతలు పార్టీ నాయకత్వం వైఖరిపై మండిపడుతున్నారు. తెనాలి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా తొలి జాబితాలో నాదెండ్ల మనోహర్ పేరు ప్రకటించారు. దీనిపై తెలుగుదేశం సీనియర్ నేత ఆలపాటే రాజేంద్రప్రసాద్ వర్గం కారాలు మిరియాలు నూరుతోంది.
తెనాలి అసెంబ్లీ సీటును పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించటంతో తెలుగు తమ్ముళ్ళు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్టు దక్కకపోవడంతో మాజీ ఎమ్మెల్యే, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అసంతృప్తితో ఉన్నారు. ఆలపాటి రాజాను బుజ్జగించేందుకు స్వయంగా రంగంలోకి దిగిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు..తాయిలాలు ఇచ్చేందుకు సిద్దం అయ్యారు.
అమరావతిలో తనను కలవాలంటూ చంద్రబాబు నుండి ఆలపాటి రాజాకు పిలుపు వచ్చింది. పొత్తుల్లో జనసేనకు ఇవ్వాల్సిన ఆవశ్యకత వివరించి రాజాను పార్టీలో కొనసాగేలా ఓదార్చేందుకు చంద్రబాబు సన్నద్దమయ్యారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఆలపాటి రాజాకు అప్పగించే యోచనలో టిడిపి అధిష్టానం ఉందని… లేదంటే ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్సీ ఇచ్చేందుకు హామీ ఇవ్వబోతున్నారని సమాచారం.
ప్రస్తుతం జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న తాడికొండ శ్రావణ్ కుమార్ కు తాడికొండ టికెట్ ఖరారు చేయడంతో, అధ్యక్ష పదవిని ఆలపాటి రాజాకు అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీంతోపాటు గుంటూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఆలపాటి రాజాకు అప్పగించేందుకు ఒప్పిస్తున్నారని.. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజాకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని భరోసా ఇవ్వనున్నారని తెలిసింది.
ఆలపాటి రాజాను సముదాయించినా ఆయన అనుచర వర్గం నాదెండ్ల మనోహర్ కు మనఃపూర్వకంగా సహకరిస్తుందా అనే అనుమానం జనసేన నేతల్లో మొదలైంది. తెనాలి నియోజకవర్గంలో టిడిపి, జనసేన నేతలు మొదటి నుంచి ఎడంగానే ఉంటున్నారు.
గుంటూరు జిల్లా చేబ్రోలులోని వడ్లమూడిలో పార్టీ నిర్వహించిన రా కదలిరా సభలో ఆలపాటి సిఎం జగన్ మోహన్ రెడ్డిని పొగిడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగలిగిన నేత జగన్ అని ఆకాశానికి ఎత్తారు. ఆ కోపం ఇప్పుడు తీర్చుకున్నారని ఆలపాటి సహచరులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.
టిడిపి తరపున తెనాలి టికెట్ రాకపోతే బిజెపి నుంచి పోటీ చేయాలని తొలుత ఆలపాటి భావించారని… బిజెపి కూడా టిడిపితో కలవనుందనే వార్తలతో ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తనకు టికెట్ ఖాయమని భావించిన ఆలపాటి రాజా ఈ తరుణంలో అధినేత మాట వింటారా… జనసేన అభ్యర్థి గెలుపునకు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి.
-దేశవేని భాస్కర్