Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్మొదటి ప్రాధాన్యత మాకే: టి.జి.

మొదటి ప్రాధాన్యత మాకే: టి.జి.

దిగువ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన నీరు ఇచ్చాకే తెలంగాణకు నీరివ్వాలని బిజెపి నేత, రాజ్యసభ ఎంపి టి.జి. వెంకటేష్ డిమాండ్ చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందాలన్నీ కెసియార్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. కృష్ణా జలాలపై 2015 లో చేసుకున్న ఒప్పందానికి తెలంగాణ కట్టుబడి ఉండకపోతే రాష్ట్ర విభజనకు విలువే లేదని స్పష్టం చేశారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల కోసమే కేసియార్ ఈ వివాదానికి తెరతీశారని వెంకటేష్ ఆరోపించారు. ఎక్కడైనా నీటి పంపకాల్లో దిగువ రాష్ట్రాలకే ప్రాధాన్యం ఉంటుందని అయన వెల్లడించారు. రాయలసీమ పథకాన్ని తెలంగాణా వ్యతిరేకిస్తే వారు నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలు కూడా ఎత్తిపోతాయని వ్యాఖ్యానించారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం 854 అడుగుల నుంచి 871 వరకు ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు నుంచి నీరు తీసుకోవడానికి వీలుంటుందని, ఇష్టానుసారం విద్యుత్ ఉత్పత్తికి నీరు వినియోగించి దిగువ ప్రాంతాలకు అన్యాయం చేస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు మొదలు పెట్టినప్పుడు మీ పార్టీ వారు కూడా నాటి వైఎస్ మంత్రి వర్గంలో సభ్యులుగా ఉన్నారని కేసియార్ కు టి.జి. గుర్తు చేశారు. రాయలసీమ ప్రజలు పిరికివాళ్ళు కాదని, ఆత్మహత్యలు చేసుకోరని, చొక్కా గుండీలు విప్పదీసి దమ్ముంటే కాల్చమని ఎదురు తిరిగే మనస్తత్వం ఉన్నవారని చెప్పారు.

తెలంగాణా నేతలు బెదిరిస్తే సీమ నాయకులు బెదిరే ప్రసక్తే లేదని, తెలంగాణలో సీమ ప్రజలు పెద్ద సంఖ్యలో సెటిల్ అయ్యారని, వారి ఓట్లు కూడా కీలకమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వెంకటేష్ హితవు పలికారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్