ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై క్రైమ్ .. హారర్ థ్రిల్లర్ కథలు రాజ్యం చేస్తున్నాయి. ఇలాంటి ట్రెండులో రాధిక రాడాన్ సంస్థ నుంచి ఒక పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ ను వదిలారు. ‘తలైమై సేయలగమ్’ పేరుతో రూపొందిన ఈ సిరీస్ కి వసంత బాలన్ దర్శకత్వం వహించాడు. కన్నడ కిశోర్ .. రమ్య నంబీసన్ .. శ్రియా రెడ్డి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, 8 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 17వ తేదీ నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న ఒక ముఖ్యమంత్రిని గద్దె దింపడానికి ప్రతిపక్షం వాళ్లు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. అతను ఆ పదవి నుంచి పక్కకి తప్పుకుంటే ఆ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి అతని కుటుంబసభ్యులే ఆరాటపడుతూ ఉంటారు. వాళ్లలో కొందరు ప్రతిపక్షం వాళ్లతోను టచ్ ఉంటారు. అయితే ఆ ముఖ్యమంత్రికి ఒక రక్షణ కవచం మాదిరిగా ఆయన సన్నిహితురాలు ఉంటుంది. ఆమె గతం ఏమిటనేది ఎవరికీ తెలియదు. కానీ ఆమెకీ .. ముఖ్యమంత్రికి మధ్య ఏదో సంబంధం ఉందని మాత్రం అంతా చెప్పుకుంటూ ఉంటారు.
ముఖ్యమంత్రి వరకూ ఇతరులు వెళ్లడానికి ఆమె అడ్డుగోడగా ఉంటుంది. అలాంటి ఆమెను తమ వైపుకు తిప్పుకోవడానికి మిగతా వాళ్లంతా ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యమంత్రి ప్రమాదంలో ఉన్నాడని గ్రహించిన ఆమె ఏం చేస్తుంది? అనేది ఆసక్తికరమైన అంశం. ఈ కథ మొదలైన దగ్గర నుంచి చివరివరకూ ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్టు ఎపిసోడ్ మినహా ఎక్కడా హింస అనేది కనిపించదు. బూతులు .. అసభ్యతకు తావు లేని సిరీస్ ఇది. రాడాన్ నుంచి వచ్చిన ఒక మంచి ప్రాజెక్టుగా ఈ సిరీస్ ను గురించి చెప్పుకోవచ్చు.