సీనియర్ స్టార్ హీరో విక్రమ్ నుంచి ఇటీవల ‘తంగలాన్’ సినిమా వచ్చింది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోను అదే టైటిల్ తో ఈ సినిమా విడుదలైంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. గిరిజన గూడానికి చెందిన వ్యక్తిగా ఈ సినిమాలో విక్రమ్ కనిపిస్తాడు. తెలుగులో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ తమిళంలో మాత్రం అక్కడి ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయింది.
తమిళంలో ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలే పనిలో ఉన్నారట. ఈ సినిమా విక్రమ్ కి విజయాన్ని తెచ్చిపెట్టినట్టుగానే అనుకోవాలి. విక్రమ్ కి సరైన హిట్ పడి చాలా కాలమే అయింది. అందువలన ఆయనతో పాటు, ఆయన అభిమానులు కూడా విజయం కోసం వెయిట్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన ‘తంగలాన్’ ఆయనకి ఊరట కలిగించినట్టుగానే అనుకోవాలి.
‘తంగలాన్’ అడవీ ప్రాంతంలోని ఒక గిరిజన తెగకి చెందినవాడు. భూమిని నమ్ముకుని అతను తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అయితే ఆంగ్లేయ అధికారుల కారణంగా భూమిని కోల్పోయిన తంగలాన్, వారి దగ్గర బానిసలుగా బ్రతకవలసి వస్తుంది. కోలార్ గిల్డ్ ఫీల్డ్స్ ను వెతికి తమకి అప్పగించమని ఆంగ్లేయ అధికారులు తంగలాన్ తెగను ఆదేశిస్తారు. ఆ బాధ్యత తీసుకున్న తంగలాన్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ.