Thursday, March 12, 2026

అక్షర నివాళి

జర్నలిజంలో ఓనమాలు నేర్చుకుని అప్పుడప్పుడే రాయడం మొదలుపెట్టిన రోజుల్లో ఒకసారి చందు సుబ్బారావు రాసిన ఒక సాహిత్య వ్యాసం చదివాను. ప్రతివాక్యం ఒక కవితలా, మెరుపులా, మైమరపులా అనిపించి ఆయన వెంటపడ్డాను. 1995 ప్రాంతాల్లో నేనొక పత్రికకు ఆదివారం అనుబంధం ఇన్ ఛార్జ్ గా పనిచేస్తున్నప్పుడు ఆయన ఆ పత్రికకు వారం వారం సాహిత్య వ్యాసం రాసేవారు. ఒక్క వాక్యం కూడా ఎడిట్ చేయడానికి వీల్లేకుండా, మార్చడానికి వీల్లేకుండా మొదటి మాటనుండి చివరి మాటవరకు ఒక ప్రవాహంలా రాసే ఆయన శైలికి నేను వీరాభిమానిని అయ్యాను. సాహిత్య విమర్శ అంటే పరమ బోరింగ్ గా, పారిభాషిక పదాల పడికట్టు వాక్యాలతో మానవమాత్రులకు అర్థంకాకుండా రాస్తుంటారు. అలాంటిది విమర్శ ఇంత అందంగా, ఆలోచనాత్మకంగా, వాక్యాలు వెంటపడేలా రాయచ్చా అనిపించేలా ఉంటుంది ఆయన రచన. ఈ ముప్పయ్ ఏళ్ళల్లో వ్యక్తిగతంగా కనీసం ఒక్కసారైనా కలవలేదు కానీ…నాకు చాలా దగ్గరయ్యారు. ఫోన్లలో కొన్ని వేల గంటలసేపు మాట్లాడి ఉంటాను. సార్ మీలాగా రాయాలి…చిట్కాలు చెప్పండి అని వెంటపడేవాడిని. చదివింది సైన్స్…కానీ తెలుగును శిల్పంలా చెక్కుతున్నారు ఆ విద్య నాక్కూడా నేర్పండి అని అడిగేవాడిని. ఒక వ్యాసంలో నీదైన ఒకే భావన చెప్పు-చాలు. భాష, వాక్యం, పదం అన్నీ నువ్ చెప్పినట్లు వింటాయి- అనేవారు. ఒకసారి సిరివెన్నెలగారు కాన్ఫరెన్స్ కాల్ చేశారు. మన అభిమాని ఒకాయన అవతల లైన్లో ఉన్నారు- మాట్లాడు – అని. అవతల లైన్లో చందు సుబ్బారావు గారు. నేను పెన్నేటిపాటమీద రాసిన వ్యాసాల ధారావాహికమీద వాళ్లిద్దరూ మాట్లాడుతుంటే వింటూ ఉన్నాను. మీరు “గంగావతరణం” అన్నారు- మధు “పెన్నావతరణం” అన్నాడు అంటూ నా వ్యాసాల్లో నాకు తెలియని విద్వాన్ విశ్వాన్ని నాకు కొత్తగా పరిచయం చేశారు ఇద్దరూ.

తెలుగు సాహిత్యంలో విమర్శ అంటే ఒకప్పుడు కేవలం గుణదోష విచారణ మాత్రమే. కానీ, దానికి ఒక ‘సౌందర్య దృష్టిని’, ఒక ‘సామాజిక తాత్వికతను’ అద్ది, విమర్శను కూడా ఒక స్వతంత్ర కళాఖండంగా తీర్చిదిద్దిన మహనీయుడు చందు సుబ్బారావు. ఆయన కలానికి ఒక వైపు తర్కపు వాడి, మరోవైపు కవిత్వపు వడి ఉంటాయి.

నుడికారపు సొగసు-అచ్చతెలుగు అలంకారం

చందు సుబ్బారావు శైలిలో ‘తెలుగుతనం’ ఉట్టిపడుతుంది. ఆయన వాడే భాషలో ఒక విలక్షణమైన దేశీయత ఉంటుంది. సంస్కృత సమాసాలను వాడినా, వాటిని తెలుగు నుడికారంతో కలిపి “పాలమీగడలా” మృదువుగా మారుస్తారు.

“కవిత్వం కేవలం కాగితం మీద కురిసిన వర్షం కాదు, అది పాఠకుడి హృదయ క్షేత్రాన్ని తడిపే పవిత్ర గంగ” అంటారాయన.

ఈ వాక్యంలోని శైలిని గమనిస్తే, ఆయన విమర్శను కూడా ఎంతటి కావ్య శోభతో రాసేవారో అర్థమవుతుంది.

సామాజిక స్పృహ – విమర్శనా వైదుష్యం

ఆయన విమర్శ కేవలం అలంకార శాస్త్రానికే పరిమితం కాలేదు. సమాజాన్ని, సాహిత్యాన్ని విడదీయలేని లంకెగా ఆయన భావించారు.

“సమాజం నుండి వేరుపడిన సాహిత్యం, వేరు నుండి వేరుపడిన చెట్టు లాంటిది. అది పచ్చగా కనిపించినా, దానిలో జీవం ఉండదు” అన్నది ఆయన నమ్మిన సిద్ధాంతం.

ఈ మాటల్లోని గాంభీర్యం, ఆయన తాత్వికత లోతును చాటుతాయి. ఆయన విమర్శలో “కత్తి లాంటి నిజం ఉన్నా, అది కన్నతల్లి లాలనలా” ఉండేది. అందుకే ఆయన రాసిన పీఠికలు మూల గ్రంథాల కంటే ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి.

కావ్యవచనం

చందు సుబ్బారావు గారి శైలిలో తాత్వికత, అలంకారం పెనవేసుకుని ఉంటాయి. ఆయన విమర్శను చదువుతుంటే, మనకు తెలియకుండానే ఒక కవితను ఆస్వాదిస్తున్న అనుభూతి కలుగుతుంది.
ఆయన ఒక సందర్భంలో కవిత్వాన్ని వర్ణిస్తూ ఇలా రాశారు:
“అక్షరాల వెనుక అనంతమైన నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దాన్ని పలికించగలిగిన వాడే అసలైన కవి. ఆ పలుకును విశ్లేషించగలిగిన వాడే అసలైన విమర్శకుడు.”
ఇది కేవలం విమర్శ కాదు, అది ఒక ‘దార్శనిక వచనం’. విమర్శలో ఇంతటి కవిత్వాన్ని చొప్పించడం కేవలం చందు సుబ్బారావు గారికే సాధ్యమైన విద్య.

సాహిత్య పరామర్శ: కొన్ని అపురూప వాక్యాలు

ఆయన రచనల నుండి మరికొన్ని ముత్యాలు:-

శైలి గురించి:-
“శైలి రచయిత ధరించే దుస్తులు కాదు, అది అతడి ఆత్మ ప్రతిబింబం.”

సంప్రదాయం గురించి:-
“సంప్రదాయం అంటే గతం మీద గౌరవం మాత్రమే కాదు, భవిష్యత్తు వైపు వేసే బలమైన అడుగు.”

విలువలు:-
“విలువలు లేని అక్షరం, వెలుగు లేని దీపం లాంటిది.”

రాస్తే ఇలా రాయాలి తెలుగు అని అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నేను కోరుకునే చందు సుబ్బారావు సార్ నా వాక్యాల్లో ఎప్పటికీ ఉండిపోతారు. సార్ మృతికి నివాళిగా ఈ నాలుగు మాటలు.

ఆచార్య చందు సుబ్బారావు- జీవిత విశేషాలు:-
జననం- మే 18, 1946, కృష్ణా జిల్లా, చదలవాడ.
మరణం- జనవరి 29, 2026 (విశాఖపట్నంలో తన 80వ ఏట కన్నుమూశారు).
ఉద్యోగ ప్రస్థానం- ఆయన కేవలం సాహితీవేత్త మాత్రమే కాదు, సైన్స్ రంగంలో కూడా విశేషమైన ప్రతిభ కనబరిచిన మేధావి. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల నుండి బి.ఎస్సీ. వైజాగ్ ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) నుండి ఎం.ఎస్సీ (టెక్నాలజీ); భూభౌతిక శాస్త్రంలో (Geophysics) డాక్టరేట్ (Ph.D) పొందారు.

వృత్తి/ఉద్యోగం- ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జియోఫిజిక్స్ విభాగంలో సుదీర్ఘకాలం పనిచేసి, ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి వైస్ ప్రిన్సిపాల్‌గా కూడా సేవలందించారు. విశాఖపట్నంలోని స్టడీ సర్కిల్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా (1988-91) పనిచేశారు. ఆయన ఒకే సమయంలో భూభౌతిక శాస్త్రవేత్తగా, మార్క్సిస్ట్ సాహిత్య విమర్శకుడిగా రెండు భిన్న రంగాల్లో సమున్నత శిఖరాలను అధిరోహించారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం)లో కీలక నేతగా వ్యవహరించారు. స్త్రీవాదం, రాజకీయం, శాస్త్రీయ అంశాలపై అనేక పుస్తకాలు, వేలకొద్దీ వ్యాసాలు రాశారు.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular