అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో మాట్లాడిన కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి పాలన, వైఖరిని ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. మణిపూర్ లో జాతుల మధ్య చిచ్చు పెట్టిన ప్రభుత్వం అక్కడ మారణహోమానికి కారణమైందని ఆరోపించారు. మణిపూర్ ప్రజలకు బాసటగా ప్రధానమంత్రి నిలబడి ఉంటె ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మణిపూర్ లో హింస చెలరేగి.. అల్లకల్లోలం నెలకొందని ఈ అంశంలో కేంద్రమే దోషి అని ఆరోపించారు.
ఇప్పటివరకు మణిపూర్ కు ప్రధానమంత్రి వెళ్లకపోవటం, అక్కడి హింసపై ప్రకటన చేయకపోవటం శోచనీయమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మణిపూర్ మండిపోతుంటే ప్రధానమంత్రి, హోం మంత్రి కర్ణాటక ఎన్నికల్లో గెలిచేందుకు ప్రచారంలో పాల్గొన్నారని విమర్శించారు. కర్ణాటకలో బిజెపిని గెలిపిచేందుకు హనుమంతుడిని కూడా ఎన్నికల ప్రచారానికి వాడుకున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం, తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు.
దేశంలో ప్రజల మధ్య విభజన రేఖ గీసేందుకు ప్రయత్నిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని… అందులో భాగంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు.