ఒకప్పుడు సినిమాను నిర్మిస్తే కథ బాగుంటే ఆడేది .. లేదంటే ఆ బాక్సును ఓ మూలాన పడేయవలసి వచ్చేది. అందువలన సినిమా నిర్మాణమనేది ఒక సాహసమైన ప్రక్రియగానే కొనసాగుతూ వచ్చింది. పెట్టిన రూపాయి తెరపై కనిపించాలనే పట్టుదలతో ఉన్నవారు నిలబడ్డారు .. ఆ లక్ష్యం లేనివారు పడిపోయారు. కానీ ఇప్పుడు అలా కాదు .. ఏ మాత్రం కంటెంట్ ఉన్నా ఏదో ఒక ఫ్లాట్ ఫామ్ పై నుంచి ఎంతో కొంత రాబట్టుకోవచ్చు. పూర్తిగా నష్టపోయే అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అందువలన చాలామంది సినిమాల నిర్మాణం దిశగా వస్తున్నారు.
అలా క్రికెటర్ ధోని .. ఆయన శ్రీమతి కూడా కొత్తగా ఒక బ్యానర్ ను సెట్ చేసుకుని, రంగంలోకి దిగిపోయారు. వాళ్ల బ్యానర్ నుంచి వస్తున్న మొదటి సినిమానే ‘LGM’. తమిళంలో ఈ సినిమాను నిర్మించారు. రమేశ్ తమిళ్ మణి దర్శకత్వంలో ఈ సినిమా రెడీ అయింది. హరీశ్ కల్యాణ్ .. ఇవానా .. నదియా .. యోగిబాబు ప్రధానమైన పాత్రలుగా ఈ సినిమా నిర్మితమైంది. ట్రైలర్ రిలీజ్ తరువాత ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. కాన్సెప్టు కొత్తగా .. చాలా సరదాగా అనిపించింది. తమిళంతో పాటు తెలుగులోను గట్టిగానే ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు.
ఒకప్పుడు పెళ్లి అయిన తరువాత ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో కొత్తజంటతో హనీమూన్ ట్రిప్ వేయించేవారు. పెళ్లికి ముందే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం మంచిదనే ఉద్దేశంతో సహజీవనానికి తెరలేచింది. ఇక ఇప్పుడు కాబోయే భార్యా భర్తల మధ్య మాత్రమే కాదు, కాబోయే అత్తా కోడళ్లకు కూడా ఒకరిని గురించి ఒకరికి ముందే తెలిసి ఉండాలనే కాన్సెప్ట్ తో ‘LGM’ వస్తోంది. ఇది యూత్ కి మాత్రమే కాదు .. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే పాయింట్. అందువలన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఆగస్టు 4వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.