కరీంనగర్ శాసనసభ ఎన్నికలు అందరిని ఆకర్షిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావటం గమనార్హం. బీఆర్ఎస్ నుంచి మంత్రి గంగుల కమలాకర్, బిజెపి నుంచి బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ నుంచి పురుమళ్ళ శ్రీనివాస్ లు తలపడుతున్నారు.
కరీంనగర్ అసెంబ్లీ ఓటర్లు మొత్తం 3.21.258 ఉన్నారు. ఎస్సీ ఓటర్లు దాదాపు 40,286, ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం దాదాపు 12.54% కాగా ST ఓటర్లు దాదాపు 5,751, 1.79% ఉంటారు. 60,075 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు, ఇది ఓటరు జాబితా విశ్లేషణ ప్రకారం 18.7%. కరీంనగర్ అసెంబ్లీలో గ్రామీణ ఓటర్లు 63,545 కాగా 19.78% ఉండగా పట్టణ ఓటర్లు 257,713, ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం 80.22%. తాజా అంచనా ప్రకారం అన్ని రకాల ఓటర్లు మూడు శాతం పెరిగారని అనధికార సమాచారం.
మంత్రి గంగుల కమలాకర్ నాలుగోసారి గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అంగ బలం, అర్థ బలం దండిగా ఉన్న గంగుల గెలుపు ఖాయమని ఆయన అనుచరులు ధీమాతో ఉన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల జారీకి చొరవ తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. విలువైన భూములు బెనామీల పేరిట కబ్జా చేశాడని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్…ప్రజా ఆందోళనలు, ప్రభుత్వంపై పోరాటంతో.. పార్టీ బలం పెంచి, ప్రజల్లోకి తీసుకెళ్ళారు. రాష్ట్ర స్థాయి నాయకుడిగా పేరు సాధించారు. ప్రస్తుతం ఎంపిగా ఉన్న బండి సంజయ్ ఎమ్మెల్యేగా పోటీ చేయటంతో ఈ దఫా అందరి దృష్టి కరీంనగర్ పైనే ఉంది. బిజెపి బిసి సిఎం ప్రకటించటంతో బండి సంజయ్ సిఎం అభ్యర్థి అని ప్రచారం జరుగుతోంది. పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు కూడా ఇదే ప్రకటించారు. సిక్కులు, ఉత్తర భారతీయుల మద్దతు బిజెపికి ఉంది.
కాంగ్రెస్ అభ్యర్థిగా పురుమళ్ళ శ్రీనివాస్ పేరు ప్రకటించటంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. శ్రీనివాస్ బొమ్మకల్ సర్పంచిగా, భార్య లలిత కరీంనగర్‌రూరల్ మండల జడ్పీటీసీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన శ్రీనివాస్ అందరు నేతలతో, కార్యకర్తలతో ఆత్మీయంగా ఉంటాడని, ఏ పార్టీ వారు సంప్రదించినా వారి సమస్యల పరిష్కారానికి శ్రీనివాస్ కృషి చేస్తాడని పేరు ఉంది.
ముగ్గురి గెలుపులో కీలక పాత్ర పోషించేది మైనారిటీలే. మైనారిటీల్లో ముస్లిం ఓట్లు సుమారు 65 వేల వరకు ఉంటాయి. గత ఎన్నికల్లో గంగుల వెంట ఉన్న ముస్లింలు ఈ దఫా కొంత అసంతృప్తితో ఉన్నారని సమాచారం. రేకుర్తిలో ముస్లింలకు కేటాయించిన ప్రభుత్వ భూమి… అదే వర్గానికి చెందిన కొందరి నేతలను ముందు పెట్టి గంగుల ఆక్రమించారని ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి తమ కోసం ప్రత్యేకంగా చేసింది ఏమి లేదని క్రైస్తవులు వాపోతున్నారు.
పురుమళ్ళ శ్రీనివాస్ రాకతో కాంగ్రెస్ వైపు ముస్లిం ఓటర్లు మొగ్గు చూపుతారని విశ్లేషణ జరుగుతోంది. బీఆర్ఎస్, బిజెపిల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారం ఇక్కడ అధిక ప్రభావం చూపుతోంది. ఈ దఫా MIM నేతలు కరీంనగర్ వచ్చినా అడ్డుకుంటామని ముస్లిం పెద్దలే హెచ్చరిస్తున్నారు. బిజెపి అభ్యర్థి బండి సంజయ్ ఎంత జోరుగా ప్రచారం నిర్వహిస్తే గంగుల కమలాకర్ కు అంతగా మైనారిటీ ఓట్లు పడుతాయని గులాబీ నేతలు అంటున్నారు.
మున్నూరు కాపు సామాజిక వర్గం ఓట్లు నియోజకవర్గంలో సుమారు ముప్పై వేల వరకు ఉంటాయి. అందులో అధిక శాతం గంగుల వైపు ఉంటారని కుల సంఘం పెద్దలు అంటున్నారు. మొదటి నుంచి మున్నూరు కాపుల ప్రతినిధిగా గంగుల వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశాడు. యువత బండి సంజయ్ కి జై అంటున్నారు. కరీంనగర్ రూరల్ ఓటర్లు పురుమళ్ళ శ్రీనివాస్ వైపు అధికంగా ఉంటారని, ముస్లిం, SC, మున్నూరు కాపు ఓటర్ల మద్దతు దక్కిన వారిని విజయం వరిస్తుంది. ఈ దఫా ఎవరు గెలిచినా తక్కువ మెజారిటీతోనే గట్టేక్కుతారు. పార్టీల పరంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపిల మధ్య హోరాహోరీగా ఎన్నికల పోరు కొనసాగే అవకాశం ఉంది.
-దేశవేని భాస్కర్
Also Read: BJP: అయోమయంలో తెలంగాణ బిజెపి