Saturday, April 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఒక పాత్రికేయుడి మరణం....

ఒక పాత్రికేయుడి మరణం….

People’s Journalist: రెండు రోజులుగా ఈ దేశం ఒక పాత్రికేయుడి మృతి పట్ల శోకిస్తోంది. ఆయన పేరు కమాల్ ఖాన్. వయసు 61.

మామూలుగా అయితే, జర్నలిస్టులెవరైనా చనిపోతే తెలిసిన మిత్రులు సోషల్ మీడియా పోస్టుల్లో రిప్ అని రాయడం, దగ్గరి వాళ్లు తమ జ్ఞాపకాలు పంచుకోవడం, యాజమాన్యం లాంఛనంగా సంతాప సందేశం విడుదల చేయడం – అలా ఒకటి, రెండు రోజుల స్మరణతో కార్యక్రమం ముగుస్తుంది.

కానీ గత రెండు రోజులుగా ముఖ్యంగా ఉత్తరాదిలో, సామాన్యుల నుంచీ బుద్ధిజీవుల వరకూ తమ కుటుంబంలోనే ఎవరినో కోల్పోయినంతగా దుఃఖించడం, తమ బాధను సోషల్ మీడియాలో ఇలా ఎడతెగకుండా వెలిబుచ్చడం మాత్రం అరుదనే చెప్పాలి.

సోషల్ మీడియా వర్చువల్ ప్రపంచంలోనే కాదు, వీధుల్లో కూడా ఆయనకు అన్ని వయసుల వాళ్లూ నివాళులర్పిస్తున్నారు. పాత్రికేయుడిగా ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుంటున్నారు… కొనియాడుతున్నారు.

ఒడిషాలోని పూరీ తీరంలో ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పాన్ని ఆవిష్కరిస్తే… వారణాసి గంగా ఘాట్‌లో ఆయన ఫొటోను పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు అక్కడి స్థానికులు.

మూడు దశాబ్దాలుగా ఎన్‌డీటీవీలో రిపోర్టర్‌గా పని చేసిన కమాల్.. శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. చనిపోవడానికి కొన్ని గంటల ముందు కూడా యూపీలో బీజేపీ నుంచి ఎస్‌పీలోకి జరుగుతున్న వలసల గురించి సవివరమైన, విశ్లేషణాత్మక రిపోర్ట్ అందించారు కమాల్.

గత నాలుగైదేళ్లలో నేను అభిమానించిన అతి కొద్ది మంది జర్నలిస్టుల్లో కమాల్ ఖాన్ ఒకరు.

బతుకుదెరువు కోసమో లేదా పాషన్ కోసమో జర్నలిస్టులుగా ఉద్యోగాలైతే చాలా మందే చేయొచ్చు కానీ, గుర్తుంచుకోదగిన జర్నలిస్టుగా నిలిచిపోవడం మాత్రం తక్కువ మందికే సాధ్యం. ఇలా తన మరణంతో అందరినీ చలించేలా చేయగలడమైతే ఇంకా అరుదనే చెప్పాలి. అలాంటి అరుదైన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిపోయారు కమాల్ ఖాన్.

లఖ్నో ఆయన నివాసం. ఎన్‌డీటీవీ రిపోర్టర్‌గా ఆయన ప్రధాన కార్యక్షేత్రం ఉత్తర్ ప్రదేశ్. ఆయన ప్రతి శ్వాసలో, ప్రతి మాటలో, ప్రతి పలకరింపులో లఖ్నో తెహజీబ్ (సంస్కృతి) ప్రతిఫలించేదని తెలిసినవారు గుర్తు చేసుకుంటున్నారు.

తను చేసే ప్రతి రిపోర్టులోనూ factualగా ఏ చిన్న పొరపాటూ లేకుండా చూసుకోవడం ఆయన తీసుకునే అత్యంత ప్రాథమికమైన ముందు జాగ్రత్త అయితే, విషయాల పట్ల లోతైన అధ్యయనం, విశ్లేషణలో పకడ్బందీ బ్యాలెన్స్, భాషపైన, సాహిత్యంపైన అద్భుతమైన పట్టు… వీటన్నింటితో పాటు తన చేస్తున్న రిపోర్టుకు తగినట్టుగా, ఏదైనా కవితనో లేదా శ్లోకాన్నో కొసమెరుపులా ఉపయోగించడంలో ఆయనకు ఆయనే సాటి అని చెప్పొచ్చు.

కమాల్ ఖాన్ ఉన్నత విద్యావంతుడని అంటున్నారు. మాస్కో స్టేట్ యూనివర్సిటీలో రష్యన్ భాష, సాహిత్యాలను అధ్యయనం చేశారట. హిందీ, ఉర్దూ సరేసరి.. ఇంగ్లిష్, రష్యన్ భాషలతో పాటు సంస్కృతంలో ఆయనకు మంచి పట్టు ఉండేదని ఆయన మిత్రులు గుర్తు చేసుకుంటున్నారు.

తమ సహొద్యోగి ఆకస్మిక మృతికి ఎన్ డి టి వీ ప్రసారం చేసిన నివాళి ఇది. ఒక్కొక్క గంభీరమయిన సందర్భంలో కమాల్ ఎంత కవితాత్మకంగా, ఆలోచనలు రేకెత్తించేలా, అలవోకగా మాట్లాడుతున్నాడో చూడండి.

ఆయన రిపోర్టుల్లో కనిపించే మరో ప్రత్యేకత సున్నితత్వం. ఎంతో కక్షపూరితంగా జరిగే ఘర్షణ గురించి రిపోర్ట్ చేసినా సరే.. అందులో మానవీయ కోణాలను, సున్నితమైన పార్శ్వాలను తడమడం, అందుకు తగినట్టుగా తన స్వరాన్ని, భాషను అన్వయించడం ఆయనకే చెల్లేదంటే అతిశయోక్తి కాదు. అరుపులు, కేకలు, రంకెలే టీవీ జర్నలిజంగా చెలామణీ అవుతున్న నేటి కాలంలో ఆయనొక పెద్ద రిలీఫ్ అనిపిస్తుండేది.

చారిత్రకంగా కుల, మత సంక్లిష్టతలకు పేరుమోసిన యూపీ లాంటి రాష్ట్రంలో రిపోర్టర్‌గా పని చేయడం ఎవరికైనా కత్తిమీద సాము లాంటిదే. ఒక ముస్లిం పాత్రికేయుడికైతే అది మరీ పెద్ద ఛాలెంజనే చెప్పుకోవాలి. ఎందుకంటే, టీవీ తెరపైన అతని నోటి నుంచి వెలువడే ప్రతిమాటనూ, ఆయన మాటల్లో ధ్వనించే ప్రతి అర్థాన్నీ కొన్ని వేల భూతద్దాలు పెట్టుకొని మరీ విశ్లేషించడానికి ఎందరో రెడీగా ఉంటారు. ‘ముస్లిం కదా… వీడిలాగే మాట్లాడుతాడ్లే’ అని ముద్రలు వేయడానికి కాచుకుని కూర్చొనే వాళ్లు లక్షల్లో ఉంటారు. రోహిత్ వేముల తన చివరి లేఖలో రాసిన మాటల్లో చెప్పుకోవాలంటే…మనిషి విలువను అతడి ‘immediate identity and nearest possibility’కి లింక్ చేసి లేబుల్స్ తగిలించడానికి క్షణం పట్టదు.

కానీ కమాల్ ఖాన్ అలాంటి వారందరినీ నిరాశపర్చారు. ఆ పరీక్షను తట్టుకోవడమే కాదు.. దాన్ని విజయవంతంగా అధిగమించారు. అది ఆయన పేరుకు తగ్గట్టుగా నిజంగానే అద్భుతం. ‘కమాల్’ అంటే amazing లేదా అద్భుతం అని అర్థం.

(పేరు వేయకపోయినా పరవాలేదు…ఈ పోస్టును వాడుకోండి అని అనుమతించిన జర్నలిస్ట్ రచయితకు కృతజ్ఞతలతో)

Also Read : లండన్ ప్రిస్టేజ్ ఈజ్ ఫాలింగ్ డౌన్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్