Saturday, January 18, 2025
HomeTrending Newsవ్యవసాయమే దేశానికి ఆధారం -మంత్రి నిరంజన్

వ్యవసాయమే దేశానికి ఆధారం -మంత్రి నిరంజన్

Agriculture : వ్యవసాయమే ఈ దేశ భవిష్యత్ తెలంగాణ దానికి దిక్సూచి అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్లలో అనేక విజయాలు సాధించాం .. ఇంకా సాధించాల్సి ఉందన్నారు. హైదరాబాద్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల అగ్రి ఎక్స్ పో సదస్సును వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోటి ఎకరాలను సస్యశ్యామలం చేసే సాగునీటి ప్రాజెక్టులను నిర్మించుకున్నామని, వ్యవసాయానికి అవసరమైన రైతుబంధు, ఉచితంగా 24 గంటల కరంటు దేశంలో ఎక్కడా లేనివిధంగా అందించడం జరుగుతొందన్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుభీమా పథకం అమలుచేసుకుంటున్నామని, తెలంగాణ జీఎస్ డీపీలో వ్యవసాయరంగ వాటా 21 శాతంగా ఉందని మంత్రి వెల్లడించారు. పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది .. రాష్ట్రాలు బాగుంటేనే దేశాలు బాగుంటాయి .. రాష్ట్రాల సమాహారమే దేశమని, ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ, కర్ణాటకలో చిన్న మొత్తం మినహా దేశంలో ఎక్కడా 5 లేదా పది లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులు కట్టలేదన్నారు. ఒకప్పుడు కంట్రోలు బియ్యం కోసం ఎదురుచూసిన తెలంగాణ రైతు నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగారు .. నేడు కేంద్రప్రభుత్వం తెలంగాణ వరి ధాన్యం కొనుగోలు చేయలేమని చేతులెత్తేసే స్థాయికి చేరుకున్నాం.

తెలంగాణ నుండి వస్తున్న ఉత్పత్తులను ఎలా వాడుకోవాలి అన్న ఆలోచన, ముందుచూపు కేంద్రానికి ఉండాలన్నారు. మేము కొనం .. మీరు సాగు చేయవద్దు అని చెప్పడం గొప్పతనం కాదు .. ఉత్పత్తులను ఉపయోగించుకునే దార్శనికత ఉండాలన్నారు. వ్యవసాయరంగం మనకు కేవలం ఆహారాన్ని ఇచ్చే రంగం మాత్రమే కాదని, 58 – 60 శాతం జనాభా ఆధారపడ్డ వ్యవసాయ రంగం మీద దేశంలో పెట్టవలసినంత దృష్టి పెట్టలేదన్నారు. దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకుని భవిష్యత్ కు బాటలు వేసే చర్యలు మాని గతాన్ని తవ్వి గందరగోళం రేపుతున్నారని బిజెపి వైఖరిని పరోక్షంగా తప్పుపట్టారు.

వ్యవసాయాన్ని మించి ఉపాధి కల్పించే రంగం ఈ దేశంలో ఇంకొకటి లేదు .. అమెరికా తర్వాత అత్యధిక సాగుభూమి ఉన్న దేశం భారత్ అని కొత్తతరం వ్యవసాయ రంగం మీద పెద్ద ఎత్తున దృష్టిసారించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఉపాధినిచ్చే రంగం వైపు యువత దృష్టి సారించకుండా ప్రభుత్వ ఉద్యోగం పేరుతో ఎండమావుల వైపు పరిగెత్తిస్తున్నారని, వ్యవసాయంతో పాటు వ్యవసాయం చుట్టు అల్లుకున్న అనుబంధ పరిశ్రమలు, సాంకేతికతలో విస్తృతమయిన ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు.

కేసీఆర్ వ్యవసాయ రంగానికి జీవం పోశారు .. దేశానికి తెలంగాణ కొత్త దారి చూపుతున్నదని, రైతుబంధు ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన 20 పథకాల్లో ఒకటి అని యూఎన్ఓ ప్రశంసించిందని మంత్రి తెలిపారు. తాగునీరు లేకున్నా ఉన్న వనరులతో అరబ్ దేశాలు అత్యున్నత స్థాయికి ఎదిగాయి .. అత్యంత అధునాతన ఉత్పత్తులు మొదట దుబాయిలో వస్తున్నాయని, గడియారాల తయారీతో స్విట్జర్లాండ్, అధునాతన కార్ల తయారీతో జర్మనీ ప్రపంచాన్ని శాసిస్తున్నాయని పేర్కొన్నారు. 70 వేల టీఎంసీల నీళ్లు, 40 కోట్ల ఎకరాల సాగుభూమి, 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ఇంకా తన పౌరులకు నాణ్యమైన ఆహారం అందించలేకపోతున్నదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : 178 ఎకరాలలో కోహెడ పండ్ల మార్కెట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్