Tuesday, March 10, 2026
HomeTrending NewsTSPSC: గ్రూప్‌-2 పరీక్ష నవంబరుకు వాయిదా

TSPSC: గ్రూప్‌-2 పరీక్ష నవంబరుకు వాయిదా

నిరుద్యోగుల ఆందోళనలు పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం గ్రూప్‌-2 పరీక్షను నవంబరుకు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. నవంబర్ 2, 3 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించనున్నట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ప్రస్తుతం గురుకుల పోస్టులకు సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో గ్రూప్‌ పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయమివ్వాలని, పరీక్షను వాయిదా వేయాలని కొన్ని రోజులుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీ నేతలు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరీక్షను వాయిదా వేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్‌.. టీఎస్‌పీఎస్సీతో చర్చలు జరపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. శనివారం టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డితో సీఎస్‌ శాంతికుమారి ప్రత్యేకంగా భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పరీక్షను నవంబరుకు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

గ్రూప్‌-2 క్యాటగిరి కింద 18 విభాగాల్లో 783 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ నెల 29,30వ తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. మరోవైపు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లోని టీజీటీ, పీజీటీ, జేఎల్‌, డీఎల్‌, లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ తదితర విభాగాల్లో మొత్తం 9210 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ట్రిబ్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆయా పోస్టులకు 2,63,045 మంది అభ్యర్థులకు పైగా దరఖాస్తు చేసుకొన్నారు. ఈ నెల 1న పరీక్షలు ప్రారంభం కాగా 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో గురుకుల పోస్టులు, గ్రూప్‌-2 రెండింటికీ సిద్ధమవుతున్న ఉద్యోగార్థులు గ్రూప్‌- 2 పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురుకుల పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో గ్రూప్‌2ను వాయిదా వేసి, పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయమివ్వాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular