Inspiration should go on: వెయ్యేళ్ళ క్రితమే సమాజంలోని అసమానతలను రూపు మాపడానికి దృఢసంకల్పంతో నడుం బిగించిన మహనీయుడు శ్రీ రామానుజ స్వామి అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. శ్రీ రామానుజ సహశ్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం ఎంతో గొప్ప విషయమన్నారు. శంషాబాద్ లోని ముచ్చింతల్ లో జరుగుతున్న వేడుకల్లో సిఎం జగన్ పాల్గొన్నారు. సంప్రదాయాల అడ్డుగోడలను ఛేదించి తనకు తెలిసిన మంత్రాన్ని అందరికీ బోధించిన గొప్ప మానవతా మూర్తి అని ప్రశంసించారు. రామానుజ స్వామి ఏ విలువలకైతే కట్టుబడ్డారో ఆ విలువలు ముందుకు తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్న సమాజంలో మనం ఉన్నామన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమాజాన్ని మార్చాలని, అందరూ సమానులే అనే గొప్ప సందేశాన్ని ఇవ్వడం కోసం చిన జీయర్ స్వామి వారు ఈ విగ్రహాన్ని నెలకొల్పారని, ఈ విగ్రహం భావి తరాలకు ఓ గొప్ప స్పూర్తిగా నిలిచిపోతుందని సిఎం జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగడం సంతోషమన్నారు. అమెరికా నుంచి విద్యార్థులు సైతం వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కీలక భాగస్వామ్యం వహించిన మై హోం అధినేత జూపల్లి రామేశ్వర రావు కు కూడా సిఎం అభినందనలు అందించారు. సిఎం జగన్ వెంట మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read : ప్రపంచ ధార్మిక కేంద్రంగా సమతాముర్తి వేదిక