Friday, March 29, 2024

మీసాల మనిషి

The Moustache Man Of India – 32ft Moustache

“ప్రపంచంలో నావే పొడవాటి మీసాలు” అని బల్లగుద్ది చెప్పాడు ఓ భారతీయుడు. రాజస్థాన్ లోని బికనీర్ ప్రాంతవాసి గిరిధర్ వ్యాస్ మీసాల పొడవు ఇరవైరెండు అడుగులు. 1985 నుంచీ ఆయన ఈ మీసాలు పెరగనిస్తున్నాడు. ఆయనకన్నా ముందు రాంసింగ్ పేరిట ఈ రికార్డు ఉండేది. అతను మన భారతీయుడే. రాంసింగ్ మీసాల పొడవు 18.5 అడుగులు.

గిరిధర్ వ్యాస్ ఈ మీసాలకు నునె పూయడానికి, దువ్వడానికి రోజూ కనీసం మూడు గంటలకాలాన్ని వెచ్చించాల్సి వస్తోందట.

ఆయన పొద్దున్న లేచీ లేవడంతోనే మొదటగా చేసే పని మీసాలను పక్కమీద విస్తరించడం. ఆ తర్వాత ఓ కప్పులో నూనె పోసుకుంటాడు. ఆ నూనె మీసాలకు పూస్తాడు. నూనె పూయడానికి దాదాపు రెండు గంటలు పడుతుందట. అనంతరం నిమ్మకాయ, నల్ల మిరియాల పొడి మీసాలకు పూస్తాడు. ఇలా చేయడంవల్ల మీసాలు మృదువుగా ఉంటాయంటాడు గిరిధర్ వ్యాస్.

ఏడాదికోసారి మీసాలను తనీటితో తడుపుతాడు. షాంపూ ఉపయోగించడు. ఎందుకంటే ఆయనకు రసాయనాలమీద నమ్మకం లేదు. నీటితో తడిపేటప్పుడు నిమ్మరసం‌, పెరుగు ఉపయోగిస్తాడు. స్నానం చేసేటప్పుడు మీసాలు పొడిగా ఉండటం కోసం వాటిని ఓ బ్యాగులో ఉంచుతాడు.

మీసాలు పెంచడంలో మక్కువ చూపుతున్న గిరిధర్ కు కొన్ని సమస్యలూ లేకపోలేదు. ఆయన అనుకున్నదల్లా తినలేడు. కొన్నింటిని మాత్రమే తినగలడు. ఐస్ క్రీమ్ తినలేడట. అన్నం తింటున్నప్పుడు తప్పనిసరిగా స్పూన్ ఉపయోగిస్తాడు. ఆయనను గ్రామస్తులందరూ భారత దేశ మీసాల మనిషి అని పిలుస్తుంటారు.

కొందరేమో అసలు పేరుతో కాక వేర్వేరు పేర్లతో తమకిష్టమొచ్చినట్టు పిలుస్తుంటారట. తన తండ్రి మీసాలను చూసి కొడుకు శివ్ వ్యాస్ గొప్పలు పోతుంటాడు. కొన్ని చోట్ల తన తండ్రి మీసాల వల్ల తనకు రాచమర్యాదలు చేస్తుంటారంటాడు కొడుకు. ఆయన మీసాలు చూడటం కోసం రోజూ ఎవరో ఒకరు ఇంటికి వస్తుంటారట. కలిసి ఫోటోలు తీసుకుంటారట. అలా ఫిటోలు తీసుకుంటున్నప్పుడు తానో సెలబ్రిటీలా ఫీలవుతాడట. పొడవైన ఈ మీసాల వల్ల తనను అనేకులు అభిమానిస్తున్నారంటాడు గిరిధర్.

అప్పుడప్పుడూ కొందరు తనను బూచోడు అని వెక్కిరిస్తున్నా విమర్శించినా ఆయన పట్టించుకోడట. కొందరైతే ఆయనను శుభ్రంగా ఉండాడని ఏవగించుకుంటారట. అలాటి వారు తక్కువేనట. అధికశాతం మంది ఆయనను గౌరవించే వారే. కొఃదరూ రోజూ వచ్చి తనను పలకరిస్తుంటారు. ఓ బార్బరు వారానికోసారి వచ్చి ఆయన మీసాలను ట్రిమ్ చేస్తుంటాడు. అతనంటే గిరిధర్ కెంతో ఇష్టం.

– యామిజాల జగదీశ్

Also Read : చిత్రకారుడు కావాలనుకున్న హిట్లర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్