Thursday, March 19, 2026
HomeTrending NewsWater war: తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి - కేటిఆర్

Water war: తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి – కేటిఆర్

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షపూరిత వైఖరి పట్ల తీవ్ర నిరాశతో ఈ బహిరంగ లేక రాస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి స్వయంగా ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించే విధంగా పలుమార్లు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురైన అన్ని రకాల ఆటంకాలను దాటుకొని, తనదైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తూ ముందుకుసాగుతున్నది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదుల ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్షతో వ్యవహరిస్తున్నది. ఈ ప్రాజెక్టుకి రెండవ దశ పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా పక్కనబెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజల తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలైన నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆశాకిరణం. 12.03 లక్షల ఎకరాలకు పైగా భూమికి సాగునీటిని, ప్రజలకు తాగునీటికి భరోసా అందిస్తూ, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చే ఈ బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అడ్డంకులు సృష్టించడం శోచనీయం.

తెలంగాణ రాకముందు మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో కరువు కాటకాలతో  తల్లడిల్లేవి.  తాగునీరు లేక నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటే, సాగునీటి సౌకర్యం లేక మహబూబ్నగర్ జిల్లా వలసల పాలయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ తో నల్లగొండ ఫ్లోరైడ్ రాక్షసభూతాన్ని మా ప్రభుత్వం తరిమికొట్టింది. నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలను మరింత సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు కరువుతో తల్లడిల్లిన ఈ జిల్లాల పచ్చబడడం కేంద్రానికి ఇష్టం లేదు. అందుకే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డు తగులుతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలన్న తెలంగాణ ప్రజల డిమాండ్ ను పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం,  అనుమతుల పేరుతోనూ అడ్డంకులు  సృష్టిస్తున్నది.

ఒకవైపు  కృష్ణ జలాల పంపిణీ, వినియోగంపై నాలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నది. దీంతో రాజ్యాంగబద్ధంగా నీటి వినియోగ అంశం రాష్ట్ర జాబితాలో ఉన్నా, ముందస్తు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తన సొంత సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు వాడుకోలేని దుస్థితిలోకి తెలంగాణను నెట్టివేసింది. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య పూరిత, వివక్షపూరిత వైఖరి దురదృష్టకరం. ఇతర రాష్ట్రాల మాదిరి తెలంగాణ ప్రజలు తమ అవసరాల, అకాంక్షల మేరకు నిర్ణయాలు తీసుకొని, అభివృద్ధి పథంలో నడిచేందుకు సైతం కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యల మీద ఆధార పడేలాచేయాలనుకోవడం ముమ్మాటికి తెలంగాణ ప్రజలను అవమానించడమే. కేంద్ర ప్రభుత్వ పక్షపాత నిర్ణయాలు, వివక్షపూరిత వైఖరి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోకుండా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular