Saturday, January 18, 2025
Homeసినిమాభూమి మీద 'యక్షిణి' హత్యాకాండ!

భూమి మీద ‘యక్షిణి’ హత్యాకాండ!

దేవకన్యలు ఏదో ఒక కారణంగా శాపానికి గురవుతూ ఉండటం .. ఆ శాపం కారణంగా వచ్చి భూమీ మీద పడటం వంటి సోషియో ఫాంటసీ కథలు గతంలో చాలానే తెరపైకి వచ్చాయి. ఎన్టీఆర్ ‘జగదేకవీరుడు’ నుంచి చిరంజీవి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’వరకూ కాస్త అటూ ఇటుగా ఈ కథలు వచ్చాయి. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో సక్సెస్ అయ్యాయి. అలాంటి ఒక కథతో రూపొందిన వెబ్ సిరీస్, ‘యక్షిణి’గా హాట్ స్టార్ ట్రాక్ పైకి వచ్చింది.

‘బాహుబలి’ బ్యానర్ నుంచి వచ్చిన సిరీస్ కావడంతో, సహజంగానే అందరి దృష్టి ఈ ప్రాజెక్టుపై పడింది. ఈ సిరీస్ కోసం చాలామంది వెయిట్ చేశారు. అలా ఎదురుచూసినవారిని నిర్మాణ విలువల పరంగా ఈ సిరీస్ నిరాశపరచలేదు. అయితే కథాకథనాల పరంగా మాత్రం అసంతృప్తిని కలిగించిందనే చెప్పాలి. ‘యక్షిణి’గా ఈ సిరీస్ లో వేదిక ప్రధానమైన పాత్రను పోషించింది. అయితే ఈ పాత్రకి ఆమె అంతగా నప్పలేదేమోనని అనిపించకమానదు. ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా అలాగే ఉంది.

‘యక్షిణి’ చేసిన ఒక పొరపాటు వలన, ఆమెను భూమిపై ఉండిపొమ్మని కుబేరుడు శపిస్తాడు. వందమంది మనుషులను అంతం చేస్తే, తిరిగి తమలోకానికి రావడానికి అవసరమైన అర్హత లభిస్తుందని శాపవిమోచనం గురించి కూడా చెబుతాడు. ఈ శాపం చాలా చిత్రంగా అనిపిస్తుంది. మహా మాయలు తెలిసిన యక్షిణికి వందమందిని చంపడం పెద్ద విషయం కాదు. అయినా అమాయకులైన మానవులను వెతికి వెంటాడి చంపడం యక్షిణికి వేసిన శిక్ష ఎలా అవుతుంది? అనిపిస్తుంది.

ఇక ‘మాయ’ అనే ఈ యక్షిణి తిరిగి తన లోకానికి వెళ్లకుండా మరో యక్షిణి అయిన జ్వాలా అడ్డుపడుతూ ఉంటుంది. మాయ వెళ్లిపోవడం వలన ఈ యక్షిణికి వచ్చే నష్టం ఏమిటనేది అర్థం కాదు. ఈ విషయంలో ఇద్దరూ అని రకాల వీఎఫ్ ఎక్స్ లను ఉపయోగించుకుంటూ ఫైట్లు కూడా చేస్తారు. ఈ సిరీస్ కి అన్ని వైపుల నుంచి మంచి సపోర్టు ఉందనే విషయం అర్థమవుతుంది. కాకపోతే కథాకథనాలపై మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్