పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తెలంగాణ ఇంజినీర్ల నైపుణ్యానికి కొలమానం. శ్రీశైలం గట్టు నుంచి ప్రాజెక్టులో చివరిదైన కేపీ లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు ఏర్పాటు చేసిన వాటర్ కండక్టర్ సిస్టమ్ పొడవు మొత్తంగా 112 కిలోమీటర్లు కాగా.. అందులో 61.08 కిలోమీటర్లు భూగర్భంలోనే ఉండడం విశేషం. ప్రధాన ఓపెన్ కెనాల్ పొడవు కేవలం 50 కిలోమీటర్లు.. కృష్ణమ్మ నీళ్లు ఎక్కువ భాగం భూగర్భంలోనే పరవళ్లు తొక్కనున్నాయి. భారీ జలాశయాలు, వాటిలోకి నీళ్లుపోసే సిస్టర్న్‌లు, సబ్ స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్స్ మాత్రమే భూ ఉపరితలంపై కనిపిస్తాయి. మిగతా నిర్మాణాలన్నీ పెద్ద పంప్‌హౌస్‌లు, సర్జ్‌పూల్స్ భూగర్భంలోనే ఉన్నాయి. భూ ఉపరితలం నుంచి సగటున వంద మీటర్ల లోతులో నిర్మితమయ్యాయి. ఒక్కో సర్జ్‌పూల్ సగటు లోతు 75 మీటర్లు కావడం విశేషం. ప్రాజెక్టు పంప్‌హౌస్‌లోని మోటర్ల వద్దకు చేరుకోవాలంటే ఉపరితలం నుంచి టన్నెల్ ద్వారా సగటున కిలో మీటర్ వరకు ప్రయాణించాల్సి ఉంది.
శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ నుంచి తొలుత ఓపెన్ అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని నార్లాపూర్ హెడ్‌రెగ్యులేటర్‌కు తీసుకెళ్తారు. అక్కడ దాదాపు ఒక కిలోమీటర్ పొడవుతో నిర్మించిన 3 సొరంగ మార్గాల ద్వారా నీటిని నార్లాపూర్ సర్జ్‌పూల్‌కు తీసుకెళ్తారు. నార్లాపూర్ (అంజనగిరి) రిజర్వాయర్ నుంచి ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్‌కు మొత్తంగా 21.68 కిలోమీటర్ల కెనాల్ ఏర్పాటు చేయగా, అందులో 5.92 కిలోమీటర్లు మాత్రమే ఓపెన్ కెనాల్. అక్కడి నుంచి 15.75 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన రెండు సొరంగమార్గాల గుండా కృష్ణమ్మ ప్రవహించి తుదకు వీరాంజనేయ రిజర్వాయర్‌కు చేరుకొంటుంది.
వీరాంజనేయ రిజర్వాయర్ నుంచి వెంకటాద్రి (వట్టెం) రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు మొత్తంగా 25.100 కిలోమీటర్ల కెనాల్‌ను తవ్వారు. అందులో కేవలం 3.100 కిలోమీటర్లు మాత్రమే ఓపెన్‌కాలువ కాగా, మిగతా మొత్తం సొరంగ మార్గమే. అందుకోసం 22 కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగాలను తవ్వారు.
ఇక ప్రాజెక్టులో మొత్తంగా 9.750 కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ ద్వారానే నీరు తరలిపోయేది కేవలం వెంకటాద్రి రిజర్వాయర్ నుంచి కురుమూర్తిరాయ (కరివెన) రిజర్వాయర్‌కు మాత్రమే.
కురుమూర్తి రిజర్వాయర్ నుంచి ఉద్దండాపూర్ రిజర్వాయర్‌కు ప్రాజెక్టు మొత్తంలో ఓపెన్ కెనాల్ లేకుండా పూర్తిగా 8.935 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారానే నీటిని తరలిస్తుండడం విశేషం. అందుకోసం రెండు సొరంగాలను ఏర్పాటు చేశారు.
సొరంగమార్గాలు మినహాయించిన దాదాపు 10 కిలోమీటర్ల మేర కృష్ణమ్మ ప్రెషర్ మెయిన్స్ పైపులు, అండర్‌గ్రౌండ్ సర్జ్‌పూల్స్, డ్రాఫ్ట్ ట్యూబుల గుండానే పరుగులు తీయనుండడం విశేషం.
ప్రాజెక్టులో నీటి తరలింపు కోసం ప్రధాన సొరంగమార్గాలు కాకుండా ఇతరత్రా వాటి కోసం సొరంగమార్గాలను నిర్మించారు. పంప్‌హౌస్‌లు, సర్జ్‌పూల్స్ నిర్మాణం కోసం, వాటిని చేరుకునేందుకు, నిర్వహణ కోసం, అత్యవసర పరిస్థితుల్లో లోపలి సిబ్బంది బయటకు వచ్చేందుకు ఎస్కేప్ టన్నెల్స్‌ను కూడా అదనంగా నిర్మించారు. ఒక్కో పంప్‌హౌస్ వద్ద నిర్మించిన ఆ సొరంగమార్గాల మొత్తం సగటు పొడవు 5-7 కిలోమీటర్లు పైనే కావడం విశేషం.
పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఏదుల, వట్టెం వద్ద నిర్మిస్తున్న సొరంగ మార్గాలు రాష్ట్రంలోనే అతిపెద్దవిగా రికార్డులకు ఎక్కనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం దేవాదుల ప్రాజెక్టు 3 ఫేజ్‌లో నిర్మిస్తున్న టన్నెల్ వ్యాసార్థం 5.6 డయామీటర్లు మాత్రమే. ఎస్‌ఎల్‌బీసీ టన్నె ల్ వ్యాసార్థం 2.10 డయామీటర్లు. కాగా వాటన్నింటి రికార్డులను కాళేశ్వరం ప్రాజెక్టు బ్రేక్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో 10 డయా మీటర్ వ్యాసార్థంతో నిర్మించిన సొరంగమార్గాలే ఇప్పటివరకు రాష్ట్రంలో అత్యధిక వ్యాసార్థంతో నిర్మించిన సొరంగమార్గాలు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డును కూడా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం బ్రేక్ చేయనుండటం విశేషం. రాష్ట్రంలోనే మొదటిసారిగా 11.5 డయా మీటరు వ్యాసార్థంతో సొరంగమార్గాలను నిర్మిస్తున్నారు.