రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని, షెడ్యూల్ ప్రకారమే వెళ్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ఒకవేళ ముందస్తు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, సింహం సింగిల్ గానే వస్తుందని, తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని.. చంద్రబాబు లాగా పొత్తుల కోసం వెంపర్లాడే ప్రసక్తే లేదని వెల్లడించారు.
బిజెపి అధ్యక్షురాలిగా పురందేశ్వరి ఎంపికపై తాము స్పందించడానికి ఏమీ లేదని, ఆమె ఎంపిక బిజెపి వ్యవహారమని వ్యాఖ్యానించారు. ఆమె రాక వల్ల తమ కొచ్చిన ఇబ్బందేమీ లేదని, వీసమెత్తు నష్టం కూడా వైసీపీకి ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి-టిడిపి-జనసేన కలిసి పోటీ చేసినా… ఆఖరికి బిఆర్ఎస్ తో కూడా కలిసి వచ్చినా తమ పార్టీకి ఎలాంటి డోకా లేదన్నారు. ఇటీవల సర్వే ఫలితాలు చెప్పిన ఆంగ్ల మీడియా 2014, 19 ఎన్నికల్లో తమకు ఎన్ని సీట్లు వస్తాయని చెప్పిందో అన్నే వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో తమకు 24-25 సీట్లు వస్తాయని ఆ సంస్థ చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సంక్షేమంతో రాష్ట్రంలోని అన్ని కుటుంబాల్లో ఒకడిగా పెనవేసుకున్నారని, ఆయన్ను వారినుంచి వేరుచేయడం సాధ్యమయ్యే పనికాదని కారుమూరి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ఓ క్యాలండర్ రూపంలో అందిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నారని వివరించారు.
ప్రత్యేక హోదా అంశాన్ని తాము విడిచి పెట్టలేదని, సిఎం జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఈ అంశాన్ని పిఎం దృష్టికి తీసుకు వెళుతున్నారని, వారు ఇవ్వమని చెప్పినా… ఇచ్చే వరకూ తాము వారికి విన్నవిస్తూనే ఉంటామని కారుమూరి చెప్పారు.