Sunday, January 19, 2025
HomeTrending NewsT Congress: తొలి జాబితాలో అధిష్టానం మార్క్

T Congress: తొలి జాబితాలో అధిష్టానం మార్క్

కాంగ్రెస్ తొలి జాబితాలో గ్రూపు రాజకీయాల కన్నా… పార్టీ అధిష్టానం మార్క్ కనిపిస్తోంది. కొన్ని మినహా ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్న వారికే చాన్సు ఇచ్చారు. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తొలి జాబితాలో 55 మంది పేర్లు ప్రకటించింది. ఈ జాబితాలో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. కొల్హాపూర్, నకిరేకల్‌లో కొత్తగా వచ్చిన వారికి టికెట్లు దక్కాయి. ఇటీవల పార్టీలో చేరిన వేముల వీరేశంకు నకిరేకల్ సీటు దక్కింది. కొల్హాపూర్ నుంచి జూపల్లి కృష్ణ రావు పోటీ చేస్తున్నారు. అలాగే నాగార్జున సాగర్ నుంచి జానారెడ్డి కొడుకు జయవీర్ పోటీ చేస్తున్నారు.

మైనంపల్లి హనుమంతరావు కుటుంబంలో ఇద్దరికి సీట్లు లభించాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు డబుల్ టికెట్లు దక్కాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హుజూర్ నగర్, పద్మావతికి కోదాడ ఇచ్చారు. జానారెడ్డి అడిగిన మిర్యాలగూడ సీటును మాత్రం హైకమాండ్ పెండింగ్‌లో ఉంచింది. నాగర్ కర్నూలులో నాగం జనార్ధన్ కుటుంబానికి నిరాశే మిగిలింది. ఎవరికీ టికెట్ దక్కలేదు.

ఖమ్మంలో 2 సిట్టింగ్‌ స్తానాలకు మాత్రమే ఈ లిస్ట్‌లో పేర్లు ప్రకటించారు. మధిర నుంచి మల్లు భట్టి విక్రమార్క పోటీ చేస్తుండగా.. భద్రాచలం నుంచి పొడెం వీరయ్య బరిలో దిగుతున్నారు. భద్రాచలం సిపిఎంకు ఇస్తారని ప్రచారం జరిగినా…సౌమ్యుడిగా పేరున్న పోడెంకు రెండోసారి అవకాశం ఇచ్చారు.

తొలి జాబితాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావుకు సీట్లు దక్కలేదు. కొత్తగూడెం సీటు సీపీఐకి కేటాయించే అవకాశం ఉండటం వల్లే, పొంగులేటి సీటు ఎక్కడ అనే విషయంలో చర్చలు సాగుతున్నట్లు సమాచారం. తుమ్మల నాగేశ్వరరావు సీటు విషయంలో హైకమాండ్ డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది. తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేస్తేనే సమ ఉజ్జీగా ఉంటుంది.  పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తే లబ్ది పొందవచ్చని జిల్లా నేతలు అంటున్నారు.

సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం పాలేరు సీటు కోరుతున్నారు. దీంతో పీటముడి పడింది. అదే జరిగితే కొత్తగూడెంకు పొంగులేటి…ఖమ్మం తుమ్మలకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

ఇక కామారెడ్డి నుంచి షబ్బీర్ అలీకి టికెట్ ఖరారు చెయ్యలేదు. దీనిపై తలో రీతిగా మాట్లాడుతున్నారు. దేల్హిలో గులాం నబీ ఆజాద్ చక్రం తిప్పినపుడు షబ్బీర్ అలీ రాష్ట్రంలో తిరుగులేని నేత. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కామారెడ్డి ఇస్తారా మారుస్తార చూడాలి.

ఇక హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ ఆశిస్తున్నారు. నిజానికి ఈ సీటు ములకనూరు సొసైటీ ప్రవీణ్ రెడ్డికి ఇవ్వటమే సముచితం. పొన్నం పోటీ చేసినా ఫలితం విభిన్నంగా ఉండవచ్చు. ఎల్.బి నగర్ నుంచి మధుయాష్కి పేరు జోరుగా వినిపించినా ఆయనను నియోజకవర్గ ప్రజలు ఓన్ చేసుకుంటారా చూడాలి. తొలి జాబితాలో బీసీ నేతలకు నిరాశే ఎదురైంది. మిగతా లిస్టుల్లో అయినా బీసీలకు అవకాశం ఇస్తారా చూడాలి.

-దేశవేని భాస్కర్

Also Read: TPCC: కాంగ్రెస్ తొలి జాబితాలో బీసీలకు మొండి చేయి

RELATED ARTICLES

Most Popular

న్యూస్