Spying Eyes Everywhere – We are under surveillance :
పెగా ప్రపంచం
నిఘా ప్రపంచం పిలిచింది
పదండి ముందుకు
పదండి తోసుకు
పోదాం…పోదాం వలలోకి
సెల్లు వాడుతూ
సిస్టం నొక్కుతూ
హృదంతరాళం సందేహిస్తూ
పదండి పోదాం
కనపడలేదా
పెగా ప్రపంచపు నిఘాపాతం?
దారి పొడుగునా
కెమెరా కళ్లకు
అర్పణ చేస్తూ
పదండి ముందుకు
బాసలు మరచి
వేషం మార్చి
కోటలన్నిటిలో పెట్టండి
ఇల్లూ వాకిలి
ఆఫీసులు
కదిలే కార్లు
ఏవీ కావు మనకడ్డంకి!
ఎముకలు కుళ్లిన
వయస్సు మళ్లిన
వేగుల్లారా చావండి
నెత్తురు మండే
నిఘాలు పండే
పెగాససులారా రారండి!
నిఘోమ్ నిఘోమ్ హర!
నిఘోమ్ నిఘోమ్ హర!
హర! హర!
అని కదలండి!
పెగా ప్రపంచం
నిఘా ప్రపంచం
ధరిత్రి నిండా నిండింది
ప్రభంజనం వలె పనిచేస్తుంది
భావ వేగమున పసిగడుతుంది
వర్షుకాభ్రముల
ప్రళయ ఘోషల్లో
ఫెళ ఫెళ ఫెళ ఫెళమని విరుచుకుపడి
పని చేస్తుంది
కనపడలేదా
ఇజ్రాయెల్ దేశపు
వెలగక మండే పెగాగ్ని?
ఎగిరి ఎగిరి ఎగిరి పడుతున్నవి
ఎరుకలేని ప్రతిపక్షాలు
జర జర పాకే వైరస్సా?
కాదిది ఉష్ణరక్త నిఘాసారం
మూడో కన్నూ
స్పై క్యామ్ వలె
ఉలకక పలకక
ఉందండీ
You’re being watched, Spying Eyes Everywhere :
విరామమెరుగని రికార్డు ఇది
త్రాచుల వలెను
రేచుల వలెను
వేధించే స్పై వేరిది
కనపడలేదా మరో ప్రపంచపు
రహస్య రికార్డింగ్ కువకువలు?
నిఘా సాఫ్ట్ వేర్ నిగనిగలు?
ఫోన్ ట్యాపింగ్ భుగభుగలు?
(శ్రీ శ్రీ “మరో ప్రపంచం” సౌజన్యంతో)
-పమిడికాల్వ మధుసూదన్
డిస్ క్లైమర్:-
ఇది ఎవరినీ ఉద్దేశించి కాదు. ఇందులో పాత్రలు, సన్నివేశాలు, సాఫ్ట్ వేర్ టూల్స్ కేవలం కల్పితం. ఏవయినా సమకాలీన సమస్యలకు ఈ పేరడీ ప్రతిబింబంలా అనిపిస్తే…అది కేవలం యాదృచ్ఛికం లేదా భ్రమ!
పాలను నీళ్లను హంస వేరు చేసినట్లు కవితావస్తువు పదబంధాన్ని కవిత, వస్తువు అని విరిచి రెండు వేరు వేరు విషయాలుగా పాఠకులు పెగాసస్ కంటపడకుండా రహస్యంగా చదువుకోగలరు.
Also Read : పెగాసస్ సెగ