Cotton Crop : ఆహారాన్ని అందరూ ఇష్టపడుతున్నారు .. ఆ ఆహారాన్ని ఉత్పత్తి చేసే వ్యవసాయ రంగాన్ని ఆదరించడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టంగా చేయాల్సిన వ్యవసాయం పాలకుల పుణ్యమా అని కష్టంగా మారిందన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో వానా కాలం – 2022 సన్నద్ధతపై నిర్వహించిన సదస్సులో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. కార్యాక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, పీజేటీఎస్ఏయూ విసి డాక్టర్.ప్రవీణ్ రావు, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లా ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
వ్యవసాయరంగంలో సమూల మార్పు రావాలన్నది తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్ష .. ఆ దిశగా అందరం కృషిచేయాలి .. రైతులు పట్టుదలతో వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించి ఆదర్శంగా నిలవాలని మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ప్రపంచ పోకడ, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా రైతులు పంటల సాగును చేపట్టాలన్నారు. దేశంలో మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ .. అనాలసిస్ వింగ్ అధ్యయనం చేసి వ్యవసాయ శాఖకు ఇచ్చే నివేదిక ప్రకారం ఏ పంటలు సాగు చేయాలో వ్యవసాయ శాఖ రైతులకు సూచిస్తుందని చెప్పారు.భారతదేశంలో వ్యవసాయ వృద్ది రేటులో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని, తెలంగాణ జీఎస్ డీపీలో వ్యవసాయరంగ వాటా 21 శాతం కావడం గమనార్హమన్నారు.
పత్తికి అంతర్జాతీయ డిమాండ్ ఉందని… ప్రపంచంలోని అనేక దేశాలలో పత్తి దిగుబడి లేదని..రాబొోయే మూడేళ్ల వరకు ఎంత ఉత్పత్తి వచ్చినా మార్కెట్ డిమాండ్ తగ్గదని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. పత్తి ఏరేందుకు సాంకేతిక పరిజ్ఞానం అధ్యయనం చేయాలని, అందుకు అనుగుణంగా ఒకేసారి పంట కాతకు వచ్చే వంగడాల మీద దృష్టిసారించాలని రైతులను కోరారు. గతంలో పంటల మార్పిడి రైతులు విరివిగా చేపట్టేది.. కాలక్రమంలో ఆ విధానంలో ఎందుకో మార్పు వచ్చింది .. ఆ దిశగా మళ్లీ చొరవచూపాలని సూచించారు. సాగులో ఎరువులు, రసాయనాల వాడకం తగ్గించాలి ..అధిక వినియోగం మూలంగా భూములు సహజత్వాన్ని కోల్పోతున్నాయి .. రైతులు తరచూ భూసార పరీక్షలు నిర్వహించాలన్నారు. ఒండ్రు మట్టి, పశువులు, గొర్ల ఎరువుల వినియోగం పెద్ద ఎత్తున పెంచాలని మంత్రి సూచించారు.
తెలంగాణలో నేడు కనిపించే లక్షల క్వింటాళ్ల ధాన్యపు రాశులను చూస్తే సంతోషం అనిపిస్తుందని, ఇది తెలంగాణ ప్రజల కష్టం, చెమటచుక్కలు, రక్తం ఉన్నాయని మంత్రి అన్నారు. దీనివెనక రైతుబంధు, రైతుభీమా, 24 గంటల కరంటు, సాగునీళ్లు ఉన్నాయి .. దీని వెనక ఏడెనిమిదేండ్లుగా కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మేధస్సు ఉందన్నారు. తెలంగాణ వడ్లు కొనాలి అని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వద్దకు వెళితే ఇంత ఉత్పత్తి ఎలా వస్తుందని ప్రశ్నిస్తాడు .. మా రైతులను మార్చుకునేందుకు మాకు కొంత సమయం ఇవ్వాలంటే ఒప్పుకోలేదు .. వారిది వ్యాపార మనసు.. వ్యవసాయ మనసు కాదని విమర్శించారు. వరికి మించి లాభాలనిచ్చే పంటలు అనేకం ఉన్నాయి .. రైతులు వరి సాగు నుండి బయటకు రావాలి … ప్రత్నామ్నాయ పంటలను సాగు చేయాలని మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
Also Read : వ్యవసాయమే దేశానికి ఆధారం -మంత్రి నిరంజన్