ఏదైనా ఒక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించడం సాధారణ విషయమేనని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక ఎలాంటి రాజకీయకోణమూ లేదని సజ్జల స్పష్టం చేశారు. బలమైన సాక్ష్యాదారలతోనే ఆయన అరెస్టు జరిగిందన్నది తనకున్న సమాచారమని వెల్లడించారు. కేసు వివరాలు సంబంధిత అధికారులు చెబుతారని, కానీ ఈ విషయంలో టిడిపి చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని అందుకే తాము స్పందిస్తున్నామని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో జరిగింది Worst deep rooted economic offence in the history of independent India అని అభివర్ణించారు.
ఈ స్కామ్ లో బాబు ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, ఇది రాత్రికి రాత్రి జరిగిన వ్యవహారం కాదని, అన్ని విషయాలు పరిశీలించాకే అరెస్ట్ చేశారని అన్నారు. 241 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించినట్లు నిర్ధారణ అయ్యిందని, పూణేలోని జీఎస్టీ అధికారులు దీన్ని తేల్చారని, ఎఫ్ ఐ ఆర్ నమోదు కావడానికకి రెండేళ్ళ క్రితమే ఇది బైట పడిందని వివరించారు. ఏపీ సిఐడి దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి బలమైన ఆధారాలు కనుగొన్నారు కాబట్టే లోతైన విచారణ కోసం అరెస్టు చేశారని, ఇది ముందే పసిగట్టిన బాబు తనను అరెస్ట్ చేస్తారని ముందే చెప్పారన్నారు. దారి మళ్లించిన నిధులు ఎటునుంచి ఎటు వెళ్ళిందనే దానిపై విచారణ చేసేందుకు ఇంత సమయం పట్టిందని సజ్జల చెప్పారు.
నిజంగా రాజకీయ కక్ష ఉండి ఉంటే రెండేళ్ళ క్రితమే అరెస్ట్ చేసి ఉండేవాళ్లమని, సిఐడి దర్యాప్తు చేసిన తర్వాతే చర్యలు తీసుకున్నారని, ఆయన్ను కేవలం విచారణ కోసం అదుపులోకి తీసుకున్నారని, ఆయన్ను ఏమీ ఉరికంబం ఎక్కించడం లేదన్నారు. ఐటి నోటీసులపై కూడా ఆయన్ను విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు, అరెస్టుకు బాబు అతీతమైన వ్యక్తి కాదన్నారు. తప్పు జరగలేదని బాబు నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అర్థరాత్రి అరెస్టు చేయలేదని పొద్దున చేశారని, కక్ష సాధింపు అంటే గతంలో తమిళనాడులో కరుణానిధిని చేసినట్లు అని… కానీ తమ ప్రభుత్వానికి. సిఎం జగన్ కు అలాంటి ఉద్దేశం లేదని పేర్కొన్నారు.