పెళ్ళిల్ల గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ కు కోపం వస్తుంది కాబట్టి ఇకపై ఆయన్ను ఏకపత్నీ వ్రతుడు అని పిలుస్తామని, ఒక సమయంలో ఒకే పత్నితో ఉంటాడు కాబట్టి అలా అంటామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ కార్మిక నాయకుడని, టిడిపి ఆఫీసు నుంచి తాడేపల్లిలో ఉన్న జనసేన ఆఫీసుకు రహస్య సొరంగ మార్గం తవ్వడానికి నిరంతరం పని చేస్తున్న కార్మిక వీరుడు నాదెండ్ల అని అభివర్ణించారు. మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్దర్ అని తాను అంటే.. పవన్ కు విపరీతమైన కోపం వచ్చిందని, కానీ నిన్న తణుకులో ఆయన మాట్లాడిన విధానం ఏమిటో ఓసారి పరిశీలించాలని…అప్పుడు తాను చెప్పింది నిజమే అనిపిస్తుందని అంటూ ఓ వీడియోను చూపించారు.
రెండు ప్యాకేజిలుగా ఉన్న వరాహం యాత్రను నిన్న ముగించిన పవన్ కు శుభాకాంక్షలు అని పవన్ పై వ్యంగాస్త్రం విసిరిన రాంబాబు, పవన్ మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడిగారు. కానీ ఆయన రావాలంటే ఓ లెక్క ఉంటుందని… సొరంగ మార్గం ద్వారా నాదెండ్ల మీ లెక్క సరిచూస్తే.. అప్పుడు మళ్ళీ మీరు వస్తారు అంటూ విమర్శలు గుప్పించారు. జగన్ ను ఎకవచంతో పిలుస్తా అని చెప్పిన దగ్గరినుంచి 373 సార్లు జగన్ పేరు ఉచ్చరించారని, వెయ్యి పూర్తి చేస్తే మోక్షం కలుగుతుందని, అప్పుడు మీరు చేసిన పాపాలు పరిష్కారం అవుతాయని హితవు పలికారు.
రాయల సీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో గుత్తేదారులకు రూ. 900 కోట్లు దోచి పెట్టారని, ఏవీసీ సంస్థలోకి నేరుగా నిధులు పంపారంటూ టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణపై అంబటి స్పందించారు. ఈ ప్రాజెక్టు కోసం రూరల్ ఎలెక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసి) నుంచి రుణం తీసుకున్న మాట వాస్తవమేనని, కానీ ఈ నిధులు ప్రభుత్వ ఖాతా లోకి రాకుండా నేరుగా గుత్తేదారు ఖతల్లోకే వెళ్తాయని, ఇది నిబంధనలోనే ఉందని, మొత్తం 739.5 కోట్లు మాత్రమేనని, వీటిలో ప్రభుత్వానికి 33.5, కాంట్రాక్టర్ కు 706కోట్ల రూపాయలు ఇచ్చారని వివరణ ఇచ్చారు.