చరణ్ లాంటి స్టార్ హీరో ఒక సినిమా చేస్తున్నాడనగానే, అందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో అనుకుంటారు. ఆ తరువాత .. విలన్ గా ఎవరిని ఎంపిక చేస్తారోననే ఊహాగానాలు మొదలవుతాయి. విలన్ గా తీసుకునే ఆర్టిస్టు బట్టి కూడా ఆ సినిమాలోని యాక్షన్ స్థాయిని అంచనా వేసుకుంటారు. దాదాపుగా పవర్ ఫుల్ విలనిజం ఉండటం ఖాయమని భావిస్తారు. చరణ్ కి ఉన్న మాస్ ఇమేజ్ అందుకు కారణమని అనుకోవాలి. అలాంటి చరణ్ సినిమాలో అసలు విలన్ ఉండడనే విషయం ఆయన అభిమానులకు తప్పకుండా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
అలాంటి ఒక ఆశ్చర్యాన్ని కలిగించడానికి ఇప్పుడు బుచ్చిబాబు రెడీ అవుతున్నాడు. ‘ఉప్పెన’ సినిమాతో 100 కోట్ల దర్శకుడు అనిపించుకున్న బుచ్చిబాబు, ఇప్పుడు తన తాజా చిత్రాన్ని చరణ్ హీరోగా పట్టాలెక్కించాడు. రీసెంటుగా చిరంజీవి క్లాప్ తో ఈ సినిమా మొదలైంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ హీరో శివరాజ్ కుమార్ ను కూడా తీసుకున్నారు. దాంతో ప్రతినాయకుడిగానే ఆయనను తీసుకున్నారని చాలామంది భావించారు. కథపై .. తన పాత్రపై నమ్మకంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి.
అయితే ఈ సినిమాలో శివరాజ్ కుమార్ పోషిస్తున్నది కీలకమైన పాత్ర మాత్రమేనని తెలుస్తోంది. ఆయన పాత్ర చాలా విలక్షణంగా అనిపిస్తుందని అంటున్నారు. ఈ పాత్రను డిజైన్ చేసిన తీరు చూసి బుచ్చిబాబును శివరాజ్ కుమార్ అభినందించాడంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతినాయకుడిగా శివరాజ్ కుమార్ నటించకపోవడమే కాదు, అసలు ఈ సినిమాలో ప్రతినాయకుడు ఉండడట. అంటే పగబట్టిన పరిస్థితులే ఈ సినిమాలో విలనిజాన్ని చూపిస్తాయన్న మాట. ఇలాంటి ఒక కథను చరణ్ అంగీకరించడం విశేషంగానే చెప్పుకోవాలి.