Saturday, November 23, 2024
HomeTrending Newsవిజయసాయికి ఏం సంబంధం?: సజ్జల

విజయసాయికి ఏం సంబంధం?: సజ్జల

పొత్తులు పెట్టుకోవడం కోసం ఒక సాకు కోసమే పవన్ కళ్యాణ్, చంద్రబాబులు రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి కృషి చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికే తాము కలుస్తున్నామని చెప్పుకోవడం కోసం కొన్ని లేనిపోని అంశాలను తెరమీదకు తెస్తున్నారని విమర్శించారు. తమ కలయికను ప్రజలు అసహ్యించుకోకుండా ఉండడం కోసమే ఇలాంటివి చేస్తున్నారన్నారు. ఇప్పటం అంశం, చంద్రబాబు కాన్వాయ్ పై రాయి దాడి దీనిలో భాగమేనన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.

ఇప్పటంలో  తమ సభ కోసం స్థలం ఇచ్చినందుకే ఇళ్లు కూల్చారంటూ పవన్ కళ్యాణ్ చెప్పారని, కానీ వివరాలు చూస్తే వారిలో ఏ ఒక్కరిదీ రోడ్ల విస్తరణలో పోలేదని, అసలు ఒక్క ఇల్లు కూడా కూల్చలేదని, ఒక ఇంటి ప్రహరీ గోడ మాత్రమే పోయిందని,  కానీ ఈ విషయమై ఓ పద్ధతి ప్రకారం డ్రామాలు చేశారని దుయ్యబట్టారు. మొదట పవన్ వెళ్ళారని, నిన్న లోకేష్ వెళ్ళారని.. రేపో మాపో బాబు కూడా వెళతారేమో అని సజ్జల వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో అరాచకం జరుగుతోందనే భ్రమ కల్పిస్తున్నారని అన్నారు.

గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు  అమరావతి పేరుతో అరచేతిలో వైకుంఠము చూపించారని, కానీ తాము ప్రజలకు భ్రమలు  కల్పించకుండా, సంక్షేమ పథకాలతో , పారదర్శకంగా పాలన సాగిస్తున్నామని చెప్పారు.  ప్రజల విశ్వాసంతో జగన్ మరోసారి అధికారంలోకి వస్తారని, దీనిపై కడుపు మంటతోనే, మీడియాను అడ్డుపెట్టుకుని… దాని అజెండా ప్రకారం ఈ రెండు పార్టీలూ ఆందోళన చేస్తున్నాయని, మళ్ళీ వీటినే ఆ మీడియా ప్రచారం చేస్తోందని సజ్జల అన్నారు. చంద్రబాబు ఇలాంటి రాజకీయాలతోనే మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని, కానీ ఇది సాధ్యం కాదనే వాస్తవాన్ని గ్రహించలేక పోతున్నారని సజ్జల అన్నారు. బాబుకు జనంతో సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయని,  ఈ విషయం తెలుసుకోలేకపోతున్నారని, ఎలాగైనా సరే జిమ్మిక్కులతో తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు.

గృహ నిర్మాణంపై జనసేన ఆందోళన అర్ధరహితమని, ఆడిట్ చేస్తామంటూ బయల్దేరడం ఆశ్చర్యంగా ఉందన్నారు. గత జూన్ లో… భారీ స్థాయిలో 21 లక్షల ఇళ్లు నిర్మాణం మొదలు పెట్టారని, ఇప్పుడు పోయి ఏమి ఆడిట్ చేస్తారని ప్రశ్నించారు.

శరత్ చంద్రారెడ్డి అరెస్టుతో వైఎస్సార్సీపీకి, విజయసాయి రెడ్డికి సబంధం ఏమిటని సజ్జల ప్రశ్నించారు. విజయసాయికి ఒక్కటే కూతురని, ఆమెను అరబిందో ఫార్మా యజమాని రెండో కుమారుడికి ఇచ్చారని చెప్పారు. ఈ పెళ్లి  కాకముందే అరబిందో అనేది  అతిపెద్ద కంపెనీగా ఎస్టాబ్లిష్ అయ్యిందని, ఆ కంపెనీలో ఏదో జరిగితే విజయసాయికి  ఎలా అంటగడతారని అడిగారు. అరెస్టు అయ్యారని చెబుతున్నది ఆయన అల్లుడి అన్న అని పేర్కొన్నారు.

విద్యావ్యవస్థలో మౌలిక మార్పులు, విలేజ్ క్లినిక్ లు, అందరికీ సంక్షేమం ద్వారా పాలనాలో మార్పులు తెచ్చిన ఈ పరిపాలనకూ నాటి బాబు పాలనకూ స్పష్టమైన తేడా గమనించాలని ప్రజలకు సజ్జల విజ్ఞప్తి చేశారు.  ఈ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్న విపక్షాలను ప్రజలే నిలదీయాలని పిలుపు ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్