Friday, October 18, 2024
HomeTrending NewsAP Politics: శాసనసభ ఎన్నికలకు పార్టీల కసరత్తు

AP Politics: శాసనసభ ఎన్నికలకు పార్టీల కసరత్తు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఈ మూడు నెలల్లో ఎవరు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. టికెట్ ఇస్తే పార్టీలో ఉండటం…లేదంటే జంప్.. ఇది నేటి రాజకీయాల్లో ట్రెండ్. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్న మూడో దఫా ఎన్నికలు టిడిపి- వైసిపి పార్టీలకు కీలకంగా మారాయి.

వైఎస్ఆర్సిపి (YSRCP)

ప్రజా సంక్షేమమే అజెండాగా సాగుతున్న వైసిపి ప్రభుత్వం ఈ దఫా కూడా ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగేందుకు సన్నద్దమవుతోంది. ప్రజా సమస్యల పరిష్కారం చేస్తూ… ప్రజల్లో ఉండేవారికే టికెట్లు ఇస్తామని మొదటి నుంచి చెపుతున్న సిఎం జగన్మోహన్ రెడ్డి… ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు.

గత వారం రోజులుగా నియోజకవర్గాల వారిగా సమీక్షలు చేస్తున్నారు. మంత్రులతో సహా సీనియర్ నేతల స్థానాలు మార్చుతూ నేతలకు వివరణ ఇస్తున్నారు. మారిన సమీకరణాలు, ప్రజాబలం, ఎందుకు మార్చాల్సి వచ్చిందో ఎమ్మెల్యేలకు నచ్చ్చేపుతున్నారు. కొన్ని స్థానాల్లో ఎంపిలను పోటీలో ఉంచుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాలే నిలబెడతాయని నేతలు ధీమాతో ఉన్నారు.

టిడిపి -జనసేన

2019 ఎన్నికల్లో పరాజయంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మరక్షణలో పడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ప్రతిసారి ఎదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవటం..ఎన్నికలు ముగియగానే మిత్రపక్షంతో ఎడంగా ఉండటం పరిపాటి. ఉమ్మడి రాష్ట్రంలో వామపక్షాలతో పొత్తు రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిజెపితో పొత్తు ఆ తర్వాత ఆయా పార్టీలతో విభేదాలు చంద్రబాబుకు సాధారణం అయ్యాయి.

2024 ఎన్నికల్లో టిడిపి- జనసేన జట్టుగా బరిలోకి దిగుతున్నాయి. సీట్లు సర్దుబాటు చేసుకొని, ఇరు పక్షాలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని రెండు పార్టీల అధినేతలు ఒప్పందం చేసుకున్నారు. జనసేనకు 25 నుంచి 30 సీట్లు ఇవ్వనున్నట్టు ప్రాథమిక సమాచారం.

నిన్న మొన్నటి వరకు రాబోయే ప్రభుత్వంలో తానే ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట మార్చారు. ముందు వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దింపటం లక్ష్యమని చెపుతున్నారు. ఇటీవల ఓ మీడియా ఛానల్ తో మాట్లాడిన లోకేష్… టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు సిఎం అవుతారని…అందులో ఎలాంటి అనుమానం లేదని కుండ బద్దలు కొట్టారు.

లోకేష్ వ్యాఖ్యలతో జనసేన నేతల్లో కలవరం మొదలైంది. మొదలు లేదు…మోపు లేదు…ఇప్పుడే ఈ విధంగా మాట్లాడితే అధికారంలోకి వస్తే తమ అధినేతను పట్టించుకుంటారా అని మదనపడుతున్నారు.

వామపక్షాలు

రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం పార్టీల ఉనికి నామమాత్రమే అని చెప్పవచ్చు. ఏదో ఒక పార్టీతో పొత్తు కుదుర్చుకుని పోటీలో ఉంటేనే గెలుపునకు అవకాశాలు ఉంటాయి. ఒంటరిగా పోటీ చేస్తే వామపక్షాలకు డిపాజిట్లు కూడా రావనేది జగమెరిగిన సత్యం. తెలుగుదేశం కూటమిలో చేరి ఒకటి రెండు సీట్లు కోరేందుకు లెఫ్ట్ నేతలు బేరసారాలు చేస్తున్నారని వినికిడి. ఇందుకు పవన్ కళ్యాణ్ సహాయం కోరుతున్నట్టు సమాచారం.

కాంగ్రెస్

రాష్ట్ర విభజన తర్వాత జీవచ్చవంలా మారిన కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా కరువయ్యారు. ముఖ్యనేతలు ఇతర పార్తీల్లోకి వెళ్ళటంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో పార్టీ నేతల్లో కొంత ఉత్సాహం వచ్చింది. అయితే చంద్రబాబు శిష్యుడిగా పేరు ఉన్న సిఎం రేవంత్ రెడ్డి…ఏపి కాంగ్రెస్ నేతలకు ఎంతవరకు సహకరిస్తారో చూడాలి.

బిజెపి

రాష్ట్రంలో బిజెపి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మిత్రపక్షంగా ఉన్న జనసేన ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించి తెలుగుదేశం పార్టీతో జతకట్టింది. ఈ నేపథ్యంలో బిజెపి ఒంటరిగానే పోటీ చేయవలసి ఉంటుంది. ఒంటరిగా బరిలోకి దిగితే డిపాజిట్లు రావటం కుడా కష్టమే. టిడిపి – జనసేన కూటమితో పొత్తు కోసం కమలం నేతలు యత్నిస్తున్నా…చంద్రబాబు ససేమిరా అంటున్నట్టు సమాచారం. బిజెపితో వెళితే మైనారిటీ వర్గాల ఓట్లు దూరం అవుతాయని బాబు ఆందోళన చెందుతున్నారు. అయితే ఎన్నికల నాటికి జనసేన తమతోనే కలిసి వస్తుందని కమలనాథులు అంటున్నారు.

పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురుందేశ్వరి ఒంటరిగానే రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నేతలను కలుపుకొని ఇప్పటివరకు ఒక ఆందోళన కార్యక్రమం కూడా నిర్వహించకపోవటంపై ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ఫలితాలతో హుషారుగా ఉన్న జనసేన-టిడిపి కూటమి… ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని చూస్తోంది. కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు…గెలుపు మీద మాత్రం తెలుగు తమ్ముళ్ళు ధీమాగా ఉన్నారు. వైసిపి అధినేత ys జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హడావిడి లేకుండా నియోజకవర్గాల వారిగా సమీక్షిస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. టిడిపి -వైసిపి మధ్య ఈ దఫా పోటీ రసవత్తరంగా ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్