Education Crises: నిన్న విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాలు దిగజారిన విద్యా విధానానికి నిదర్శనమని టిడిపి సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర వ్యాఖ్యానించారు. గత దశాబ్ద కాలంలో ఇలాంటి ఫలితాలు చూడలేదన్నారు. మంత్రి అందుబాటులో లేదన్న కారణంగా ఫలితాలను రెండ్రోజులపాటు వాయిదా వేయడం దౌర్భాగ్యమన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత విద్యా వ్యవస్థను సర్వం నాశనం చేసిందన్నారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో నరేంద్ర మీడియాతో మాట్లాడారు.
కోవిడ్ సమయంలో డిజిటల్ విద్యా విధానంపై అన్ని రాష్ట్రాలూ ఆలోచన చేస్తే మన రాష్ట్రంలో మాత్రం టీచర్లను వైన్ షాపుల వద్ద కాపలా ఉంచారని నరేంద్ర విమర్శించారు. పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తమ స్వార్ధం కోసం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు. గతప్రభుత్వాలు విద్య కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేశాయని, కానీ విద్యా వ్యవస్థలో సంక్షోభాన్ని తీసుకు వచ్చే విధంగా ఈ ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలకు ఈ ప్రభుత్వం విద్యనూ దూరం చేస్తోందని నరేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రజలు కూడా ఆలోచన చేయాలని సూచించారు.
Also Read : విద్యార్ధులు నష్టపోకుండా చర్యలు: బొత్స