Saturday, March 7, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅణుబాంబు కంటే విధ్వంసకరమైన గీత రచయిత!

అణుబాంబు కంటే విధ్వంసకరమైన గీత రచయిత!

ఏ దేశం ఏ దేశంమీద ఎవరి ఆదేశంతో, ఆవేశంతో క్షిపణి దాడులు, బాంబు దాడులతో ఎందుకు భూకంపం సృష్టిస్తోందో తెలియని వేళ…అమెరికా నుండి ఆకాశమార్గాన విమానం రెక్కలమీద హైదరాబాద్ వస్తూ ఒక సగటు తెలుగు అభిమాని మధ్యలో దుబాయ్ లో ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు. ఒక రాత్రి గడిచాక వేలమంది ప్రయాణికులను విమానయాన సంస్థలు దగ్గర్లో ఉన్న హోటళ్ళకు తరలించాయి. దీపావళి రాత్రి ఆకాశంలో టపాసుల మిలమిలలు, తళతళలు మెరిసినట్లు దూసుకువస్తున్న తోకచుక్కల్లా ఉన్న బాంబులను ఆసక్తిగలవారు తమ సెల్ ఫోన్లలో సెల్ఫీ వీడియోలు, ఫొటోలుగా తీసుకుని వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రపంచానికి అశాంతిని, అధైర్యాన్ని షేర్ చేస్తున్నారు.

అప్పుడు అనుకోకుండా జరిగింది ఈ అణు విస్ఫోటనం. మన సగటు తెలుగు అభిమాని హోటల్ రూమ్ పక్కన ప్రఖ్యాత తెలుగు సినిమా పాటల రచయిత ఉండడం కేవలం విధి లిఖితం. ఎలాగూ రూముల్లో పడే బాంబుల గురించి మాట్లాడి మాట్లాడి గుండెలు జారిపోయాయి కాబట్టి…ఆటవిడుపుగా పాటల రచయితతో మాట్లాడితే జారిన ప్రాణాలైనా నిలబడతాయేమో అనుకుని సగటు తెలుగు అభిమాని పాటల రచయితను ప్రార్థనాపూర్వక దృక్కులతో కదిలించాడు. రచయిత పెదవి విప్పాడు. అంతే బుర్జ్ ఖలీఫా కంపించింది. గల్ఫ్ ఎడారి గొంతు తడారిపోయింది.

ఈమధ్య అతడు రాసిన పాట ఎలా పుట్టిందో తన్మయత్వంతో వివరిస్తున్నాడు. అటు బయట గురిచూసి వదిలిన క్షిపణులు ఆకాశంలో పక్షుల్లా వచ్చి మీద పడుతున్నాయి. ఇటు లోపల రచయిత శతఘ్నులు కురిపిస్తున్నాడు. చిన్నప్పుడు వీధి బడిలో నేర్పిన కా గుణింతాల ఆధారంగా “కా క కా…కికి…కి కి కీ…కాకీక కాకీకే…కోకీక కోకికే…కాకీక కాకికి కాక కేకికా?” అన్న పల్లవికి “నా నానీ! నీ నూనె నా నూనేనని నేనన్నానా? నా నూనె నా నూనే! నీ నూనె నీ నూనే!” అన్న చరణంతో అల్లిన అక్షర విన్యాసం పెను విస్ఫోటనమై ప్రపంచవ్యాప్తంగా భాషాతీతంగా అందరూ ఈ ఏకాక్షర గీతానికి ఎలా బ్రహ్మరథం పడుతున్నారో ఆగకుండా చెప్పుకుపోతున్నాడు. బయట బాంబుల వర్షం. లోపల గీత రచయిత ఏకాక్షరాల భూకంపం.

ఈలోపు అమెరికా సి ఐ ఐ ఏజెంట్లు ప్యారాచూట్లతో హోటల్ పైకప్పుపై దిగి…రచయితను పట్టుకుపోయారు. ఏమి జరిగిందో తెలుసుకునేలోపు రచయిత మాయం. తరువాత ఆరా తీస్తే తెలిసింది. అమెరికా ఇరాన్ మీద కాలుదువ్వినందుకు నెలకు లక్షల కోట్ల ఖర్చట. అంత ఖర్చు దండగ. ఈ రచయిత తన సొంత గొంతుతో ఏకాక్షర గీతంలో ఒక్కో పదాన్ని వదిలితే…సగం దేశం మాడి మసై బూడిద కూడా మిగలని ఎడారి అవుతుందని…సశాస్త్రీయంగా రుజువయ్యింది కాబట్టి…రచయితను ఆకాశమార్గంలో అపహరించుకుని వెళ్లారట.

ఏమాటకామాట!
“భూకంపం సృష్టిస్తా…భూమార్గం పట్టిస్తా…”అని అంతటి శ్రీశ్రీ ఊగిపోయాడే కానీ…భూకంపం రాలేదు.
కానీ ఇప్పుడు ఒక తెలుగు గీత రచయిత ఒక్కో అక్షరంతో భూకంపం సృష్టిస్తున్నాడు. అణు యుద్ధం కంటే అక్షర యుద్ధం పెద్దదని నిరూపిస్తున్నాడు. ఇది యావత్ తెలుగు ప్రజలందరికీ గర్వకారణమైన యుద్ధ సందర్భం!

అన్నట్లు-
ఈ పాట రాయడానికి ఆయన ఆరునెలలు నిద్రలేని రాత్రులు గడిపాడు. ఆరు నెలలు పగలు రాత్రిగా వణికిపోతూ ఒక్కో అక్షరాన్ని పేర్చాడు. ఈసారి ఆస్కార్ మొదలు అన్ని అవార్డులు ఎలాగూ ఈ పాటకే వస్తాయి కాబట్టి…యుద్ధమేఘాలు తొలగిన తరువాత రచయిత ఇటురాకుండా అటునుండి అటే లాస్ ఏంజిలిస్ వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం కూడా సముచితంగానూ, సందర్భోచితంగానూ, భావ్యంగానూ ఉన్నది.

ఈ పాటలో వేదాంత, సైద్ధాంతిక, శాస్త్రీయ పారిభాషిక పదాల మీద, వాటి అన్వయం మీద అనేక అంతర్జాతీయ యూనివర్సిటీల భాషాశాస్త్ర శాఖల్లో ప్రత్యేక పరిశోధనలు మొదలయ్యాయి.

ఇవన్నీ తెలిశాక హోటల్ రూము గుమ్మంముందు స్పృహదప్పి పడిపోయిన సగటు తెలుగు అభిమానిని హుటాహుటిన గల్ఫ్ తెలుగు సంఘం కార్యదర్శి విమానాశ్రయం పక్కనున్న ఏడు నక్షత్రాల హాస్పిటల్లో చేర్చి…బాధ్యతగా వాళ్ళింటికి సమాచారం ఇచ్చాడు. అతడి వైద్యఖర్చులను భరిస్తామని రెండు తెలుగు రాష్ట్రాలు అధికారికంగా సంయుక్త ప్రకటన చేయడం తెలుగు పరిరక్షణలో మహోజ్వల సన్నివేశంగా మీడియాలో వార్తలు మొదలయ్యాయి.

అణుబాంబు కంటే విధ్వంసకరమైన రచయిత పుట్టడం…ఆ పుట్టిన వేళ మనం కూడా పుట్టి ఉండడం కాకతాళీయం కానే కాదు. విధి లిఖితం. మన పూర్వజన్మల పుణ్యాల ఫలం.

డిస్ క్లైమర్:-
ఇది ఎవరినీ ఉద్దేశించి కాదు. ఇందులో సన్నివేశాలు, యుద్ధ వైపరీత్యాలు, పాత్రలు, పాత్రల స్వభావాలు కేవలం కల్పితం!

-పాట విని…ఆసుపత్రి మంచాన పడ్డ సగటు తెలుగు అభిమాని అటెండెంట్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular