Saturday, September 21, 2024
Homeసినిమాకోలీవుడ్ ఇక మారదా..?

కోలీవుడ్ ఇక మారదా..?

తెలుగు సినిమా ప్రపంచ వ్యాప్తంగా సత్తా చూపిస్తోంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసింది. బాహుబలి 2 అయితే.. 1000 కోట్లు కలెక్ట్ చేసి తొలి భారతీయ సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా అయితే.. ఆస్కార్ అవార్డ్ సాధించి హాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూసేలా చేసింది. తెలుగు సినిమా ఈస్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి కారణం దర్శకధీరుడు రాజమౌళి. అందులో ఎలాంటి సందేహం లేదు.

ఇదిలా ఉంటే.. తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంది అనుకుంటే ఆ సినిమాను ఆదరిస్తుంటారు. తమిళ స్టార్స్ రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్, సూర్య, ధనుష్ చిత్రాలే కాకుండా చిన్న హీరోల సినిమాలను కూడా ఆదరించారు. బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించారు. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు తమ సినిమాలను వేరే భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ సినీ పరిశ్రమలో మిగిలిన భాషలకు సంబంధించిన సినిమాలు బాగుంటే ఆదరిస్తున్నారు.

అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు కానీ.. కోలీవుడ్ లో పరిస్థితి అలా లేదు. వేరే భాషల చిత్రాలను రిలీజ్ చేయడానికి అంతగా ఇంట్రస్ట్ చూపించడం లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. కోలీవుడ్ హీరో విజయ్ లియో మూవీని తెలుగులో భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమాకి కావాల్సిన థియేటర్లు ఇస్తున్నారు కానీ.. రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాకి మాత్రం తమిళనాడులో థియేటర్ల దొరకని పరిస్థితి అని వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో థియేటర్లో విజయ్ లియో మూవీతోనే నింపేస్తున్నారట.

టైగర్ నాగేశ్వరరావుకి బాలీవుడ్ లో బాగానే సపోర్ట్ చేస్తున్నారు కానీ.. కోలీవుడ్ లోనే అంతగా సపోర్ట్ చేయడం లేదని తెలిసింది. ఇటీవల సెల్వమణి తమిళ సినిమాల్లో తమిళ నటీనటులే నటించాలి.. ఆ సినిమాలకు తమిళ టెక్నీషియన్సే వర్క్ చేయాలి.. అన్నారు. దీని పై పవన్ కళ్యాణ్ సైతం స్పందించి.. అలా తమిళ సినిమాల్లో తమిళలు మాత్రమే నటించాలి. వాళ్లే టెక్నీషియన్స్ గా ఉండాలి అనడం కరెక్ట్ కాదు. అలా చేస్తే.. ఇండస్ట్రీ ఎదగదు అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ పై నాజర్ స్పందించారు. సెల్వమణి చెప్పినదానిని సీరియస్ గా తీసుకోవద్దు.. అందరూ కలిసి పని చేయాలన్నారు కానీ.. ఇంకా తమ రాష్ట్రంలో తమ సినిమాలే ఆడాలనే ఆలోచనతోనే ఉన్నారట. ఏది ఏమైనా తమిళ ఇండస్ట్రీ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించడంలో తమ సినిమాలతో సత్తా చూపించడంలో వెనకబడింది. తమిళ ఇండస్ట్రీ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని.. మార్పు రాకపోతే మరింతగా వెనకబడడం ఖాయం అంటున్నారు సినీజనాలు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్