రవితేజ హీరోగా ‘టైగర్ నాగేశ్వరరావు‘ రూపొందిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో .. మంచి స్టార్ క్యాస్టింగ్ తో ఈ సినిమాను నిర్మించారు. క్రితం నెల చివరిలోనే ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేశారు. ట్రైలర్ తోనే ఆకట్టుకున్న ఈ సినిమా, తప్పకుండా హిట్ కొడుతుందని రవితేజ ఫ్యాన్స్ భావించారు. అయితే ఆశించిన స్థాయిలో వాళ్లకి ఈ సినిమా కనెక్ట్ కాలేకపోయింది. వంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా, రవితేజ కెరియర్లో మరో ఫ్లాప్ గా నిలిచింది.
ఈ సినిమా నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీకి ఈ సినిమా వస్తున్నట్టుగా ముందుగా ఎలాంటి సమాచారం లేదు. ఒక్కసారిగా ఈ సినిమా ఓటీటీ ట్రాక్ పై కనిపించడంతో రవితేజ ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు. చాలా తక్కువ గ్యాపులోనే రవితేజ సినిమా ఓటీటీకి వచ్చేసిందని అనుకోవాలి. భారీతనం పరంగా .. టేకింగ్ పరంగా చూసుకుంటే ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇది 1970 కాలానికి చెందిన కథ. అప్పట్లో గజదొంగగా ఉన్న ‘టైగర్ నాగేశ్వరరావు’ కథ. అందువలన ఆ కాలం నాటి వాతావరణం .. కాస్ట్యూమ్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను రూపొందించారు. యాక్షన్ పరంగా రవితేజ మార్క్ కనిపించినప్పటికీ, పాటలు .. డాన్సుల విషయంలో సరైన దృష్టి పెట్టకపోవడం వలన అభిమానులకు కాస్త నిరాశ కలిగింది. బయోపిక్ కనుక అలా జరిగిందనుకుని సరిపెట్టుకోలేకపోవడమే అందుకు కారణమని అనుకోవాలి.