మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి గారు 1914 ఆగష్టు 10 న తిరుపతిలో జన్మించాడు. అతని మాతృభాష తమిళం. మదనపల్లెలో బిసెంట్ థియొసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. ఈ రోజు 107 వ జయంతి. ఒకరోజు దేశోధ్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు “నీకు తెలుగు వచ్చా” అని అడిగాడు. దానికి సమాధానంగా “మీకు తెలుగు రాదా” అని అడిగాడు. నివ్వెర పోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగు లోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియ లేదు అని అన్నాడు.
శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి. పద్య కవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. పద్యాలలోనూ తేటగీతి ఆయన ఎంతో ఇష్టపడ్డ ఛందస్సు. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాసాడు.
సుందరచార్యులు భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేసాడు. ఆంధ్ర పత్రికలో అచ్చుదోషాలు దిద్దేవాడిగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన.
ప్రేమించి పెళ్ళి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. తాగుడుకు అలవాటు పడ్డాడు. సుందరాచారి 1977 ఏప్రిల్ 8 న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు.
శంకరంబాడి సుందరాచారిని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము ప్రసన్న కవి అని గౌరవించింది. ఆయనను భావకవి అనీ, అహంభావకవి అనీ కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు. సుందరాచారి గేయ, గీత, బుర్రకథ, నాటక, ఖండకావ్య, కథారచనలే కాక, వేలాది ఉపన్యాసాలు కూడా చేశారు. నాస్వామి, గీతాంజలి వంటి కావ్యరచనలు, కెరటాలు, సుందర సుధాబిందువులు వంటి ఖండకృతులు, గాలిమేడలు, అరాచకం వంటి దృశ్య కృతులలో నాటకాలు, బుద్ధగీత, ఏకలవ్యుడు వంటి ప్రబోధ రచనలు చేశారు.