Don’t Care: బండి సంజయ్ పిచ్చి చేష్టలు చేస్తున్నారని టిఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. మొన్నటి మీటింగ్ తో వాపును చూసి బలుపు అనుకుంటున్నారని విమర్శించారు. కేసిఆర్ ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం దరఖాస్తుపై లింగయ్య స్పందించారు. ముందుగా మోడీ ఇచ్చిన హామీలు, వాటి అమలుపై వివరాలు తెలుసుకోవాలని హితవు పలికారు.
కేసిఆర్ గొప్ప పాలనాదక్షుదని, ప్రజల సమస్యలపై ఆయనకు ఎంతో అవగాహన ఉందని, ఎనిమిదేళ్లుగా ఎన్నో రంగాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని బడుగుల వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేంద్ర మంత్రులు ప్రశంసించిన విషయాన్ని తెలుసుకోవాలన్నారు. తమ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు చేపట్టిందని, నిన్న గాక మొన్న టి హబ్-2 ను ఘనంగా ప్రారంభించుకున్నామని, ఐటి రంగంలో హైదరాబాద్ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చేందుకు మంత్రి కేటిఆర్ ప్రయత్నిస్తున్నారని లింగయ్య వెల్లడించారు. కేంద్రం నుంచి పైసా కూడా తీసుకు రాలేకపోయిన దద్దమ్మలు బిజెపి నేతలు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి నిధులు తీసుకు రావాల్సింది పోయి అర్ధం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలో ఇచ్చిన హామీల్లో ఒకట్రెండు తప్ప మిగిలిన హామీలన్నీ సిఎం అమలు చేశారని, కేసిఆర్ అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ప్రజలు బలంగా నమ్ముతున్నారని లింగయ్య విశ్వాసం వెలిబుచ్చారు. బిజెపి నేతల ఉడుత ఊపులకు భయపడేవారు ఎవరూ లేరన్నారు. తమది దాపరికం లేని పాలన అని, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే నాయకుడు కేసిఆర్ అని స్పష్టం చేశారు.
Also Read : టిఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సమాచార అస్త్రం