TRS full strength in Council:
స్థానిక సంస్థల కోటాలో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ ఆరు స్థానాలూ గెల్చుకుంది. మొత్తం 12 సీట్లకు నోటిఫికేషన్ విడుదల కాగా నాలుగు జిల్లాల్లోని ఆరు స్థానాలు… నిజామాబాద్-1 (కల్వకుంట్ల కవిత), రంగారెడ్డి-2 (పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు); మహబూబ్ నగర్-2 (కె.దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి); వరంగల్-1 (పోలంపల్లి శ్రీనివాసుల రెడ్డి) ఏకగ్రీవం అయ్యాయి.
ఎన్నికలు జరిగిన ఆరుస్థానాల్లో కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ భాను ప్రసాద రావు, ఎల్. రమణ; నల్గొండ -ఎంసీ కోటిరెడ్డి ; మెదక్ – యాదవ రెడ్డి; ఖమ్మం-తాతా మధు, ఆదిలాబాద్- దండే విఠల్ గెలుపొందారు.
అయితే ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ కు భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది, తమ సంఖ్యా బలానికి మించి కాంగ్రెస్ పార్టీ ఓట్లు సంపాదించింది. ఆ పార్టీకి 103 ఓట్లు ఉండగా 139 ఓట్లు అదనంగా మొత్తం 242 లభించాయి. దీనిపై టిఆర్ఎస్ అధిష్టానం ఆరా తీస్తోంది. మెదక్ లో తమ పార్టీకి 230 ఓట్లు వస్తాయని, వీటి కంటే ఒక్క ఓటు తగ్గినా తాను పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే, నేటి కౌంటింగ్ లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన జగ్గారెడ్డి భార్య నిర్మలకు 237 ఓట్లు దక్కాయి. ఏడు ఓట్లు అదనంగా దక్కించుకుని మరీ తన ఛాలెంజ్ ను జగ్గారెడ్డి నిలబెట్టుకున్నారు.
మరోవైపు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి నియమితులయ్యారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం 40 మంది సభ్యులున్న శాసనమండలిలో టిఆర్ఎస్ 36 స్థానాలతో బలమైన పక్షంగా అవతరించింది. మిత్రపక్షం ఎంఐఎం-2, కాంగ్రెస్-1, ఇండిపెండెంట్-1 సఖ్యాబలం ఉంది.