బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు. తొలివిడత యాత్ర ఆగస్టు 9 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. కేసిఆర్ అవినీతి, కుటుంబ పాలనను అంతమొందించడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర మొదలుపెడుతున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో దీనిపై ప్రకటన చేశారు. క్విట్ ఇండియా ఉద్యమం మొదలైన రోజు ఆగస్టు 9 నుంచి మొదటి విడత పాదయాత్రను చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి మొదలుపెడతామని అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున హుజురాబాద్ చేరడంతో తొలి దశ యాత్ర పూర్తవుతుందని చెప్పారు. పాదయాత్రను కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా హుజురాబాద్ లో బిజెపి గెలుపు ఖాయమని బండి ధీమా వ్యక్తం చేశారు.
అంతకుముందు బిజెపి హుజురాబాద్ ఎన్నికల సన్నాహక సమావేశం కూడా జరిగింది. పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రాజా సింగ్, డి.కే. అరుణ, మురళీధర్ రావు, జితేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.