రాష్ట్రంలో మరో పది రోజులు లాక్‌డౌన్ పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయించింది. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసియార్ అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి ప్రధానంగా కరోనా, లాక్ డౌన్ అంశాలపైనే చర్చిందింది. లాక్ డౌన్ పొడిగిస్తూనే ఆంక్షల సడలింపు సమయాన్ని పెంచింది. ఉ. 6 గంటల నుంచి సా. 5 గంటల వరకు సడలింపులు ఉంటాయి. ఇళ్ళకు చేరేందుకు మరో గంట పాటు వెసులుబాటు ఉంటుంది. సా. 6 గంటల నుంచి ఉ. 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని మంత్రి మండలి తీర్మానించింది.
ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలతో పాటు నల్గొండ జిల్లా లో మాత్రం ఇవాళ్టి సడలింపులు వర్తించవు. ఒక్క నరికేకల్ కు మాత్రమే నేటి సడలింపు అందుబాటులోకి వస్తుంది. క్యాబినెట్ ఈరోజు ఆమోదించిన లాక్ డౌన్ కొత్త మార్గదర్శకాలు ఎల్లుండి (జూన్ 10) నుంచి అమల్లోకి వస్తాయి.
రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని క్యాబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది.