గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ప్రగతికోసం బౌద్ధం చూపిన బాట నేటికీ ఆచరణీమయన్నారు. తెలంగాణ సమాజపు మానవత్వ పరిమళాలు, శాంతి సహనం తో కూడిన అహింసాయుత జీవన విధానం, వీటిలోని మూలాలు బౌద్ధ వారసత్వం నుంచే అలవడ్డాయని సిఎం వివరించారు.
ఫణిగిరి వంటి నాటి బౌద్దారామాల్లో బయల్పడుతున్న అరుదైన బౌద్ద చారిత్రక సంపంద, గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాలను అల్లుకొని తెలంగాణలో బౌద్ధం పరిఢవిల్లిందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని సిఎం తెలిపారు. నాగార్జున సాగర్ లో ప్రభుత్వం అభివృద్ది చేస్తున్న బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధకేంద్రంగా రూపుదిద్దుకుంటున్నదని సిఎం తెలిపారు. రాష్ట్రంలోని బౌద్ధ వారసత్వ కేంద్రాలను పునరుజ్జీవింప చేసి ప్రపంచ బౌద్దపటంలో తెలంగాణకు సముచితస్థానాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని సిఎం అన్నారు. ప్రజా సంక్షేమం, ప్రగతి కోసం పాటుపడడం ద్వారా మాత్రమే భగవాన్ గౌతమబుద్ధునికి నిజమైన నివాళి అర్పించగలుగుతామని, తెలంగాణ ప్రభుత్వం అదే దిశగా ముందుకు సాగుతున్నదని సిఎం కెసిఆర్ అన్నారు.