కోవిడ్ నియంత్రణ కోసమే లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని, ప్రజలు అర్ధం చేసుకుని సహకరించాలని డిజిపి మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. లాక్ డౌన్ అమలు తీరును నేడు కూడా డిజిపి స్వయంగా పర్యవేక్షించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ జోన్ నాగోల్ లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను అయన పరిశీలించారు. అత్యవసర పనులపై వెళ్ళాల్సినవారు, అవసరం ఉన్నవారు లాక్ డౌన్ తో ఇబ్బందులు పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ట్రాఫిక్ డిసిపి, ఎల్బీనగర్ డిసిపిలతో మాట్లాడి పరిస్థితిని డిజిపి అడిగి తెలుసుకున్నారు. జోన్లుగా విభజించి ఎక్కడిక్కడ లాక్ డౌన్ ను అమలు చేస్తున్న తీరును అభినందించారు. పొలీస్ తనిఖీల్లో పాల్గొన్న రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ట్రాఫిక్ విభాగం సిబ్బందితో కూడా డిజిపి కాసేపు మాట్లాడారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. నకిలీ ఐడి కార్డులతో…. అనవసరంగా రోడ్ల పైకి వస్తున్న వాహనాలు సీజ్ చేస్తున్నారు. శుక్ర, శనివారాల్లో ఫుడ్ డెలివరీ బాయ్స్ ను కూడా నిలువరించిన పోలీసులు మంత్రి కేటియార్ చొరవతో ఆదివారం నుంచి వారిని అనుమతిస్తున్నారు.