తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నట్టు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ నెల 28 నుంచి వారికి సమాచార ప్రసారాల శాఖ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200లకు పెంచుతున్నట్టు డీహెచ్ ప్రకటించారు.
పాజిటివిటీ రేటు తగ్గుతోంది :
తెలంగాణలో ఇప్పటివరకు 56 లక్షల మందికి టీకాలు వేసినట్టు డీహెచ్ వెల్లడించారు. ప్రస్తుతం 6.18 లక్షల కొవిషీల్డ్, 2.5లక్షల కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జూన్ తొలి వారంలో మరిన్ని డోసులు వస్తాయన్నారు. నిరంతరం ప్రజలకు దగ్గరగా ఉండే వారిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించి వారికి ఈ నెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు వ్యాక్సినేషన్ చేయనున్నట్టు తెలిపారు. క్యాబ్ డ్రైవర్లకు జీహెచ్‌ఎంసీ ద్వారా వ్యాక్సినేషన్ అందిస్తామన్నారు. ఈ నెలాఖరు నాటికి 3లక్షల మందికి కొవాగ్జిన్ రెండో డోసు ఇవ్వాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 4.1శాతం; రికవరీ రేటు 92.52శాతంగా ఉందన్న ఆయన.. మరణాల రేటు 0.56శాతంగా ఉందని తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలు :
‘‘కరోనా తర్వాత కొందరు బ్లాక్‌ఫంగస్ బారిన పడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలు అందిస్తున్నాం. కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో 240కి పైగా బ్లాక్‌ఫంగస్ కేసులు ఉన్నాయి. రోజూ 20 బ్లాక్ ఫంగస్ బాధితులకు శస్త్రచికిత్స చేస్తున్నాం. రాష్ట్రంలో 1500 కేంద్రాల్లో కొవిడ్ ఓపీ సేవలు ఉన్నాయి. 2.7లక్షల మందిలో లక్షణాలు గుర్తించి కిట్లను అందజేశాం’’ అన్నారు.