అధిక ఫీజులు వస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చిన ఆస్పత్రులపై చర్యలకు రంగం సిద్ధం చేశామని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ వి. శ్రీనివాసరావు వెల్లడించారు. 86 ప్రైవేటు ఆస్పత్రులకు షోకాజు నోటీసులిచ్చామని, గడువులోగా సమాధానం చెప్పకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేసినా, సౌకర్యాల విషయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా 9154170960 నంబరుకు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
బ్లాక్ ఫంగస్ వ్యాధితో 278 మంది పేషంట్లు 46 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారికి కావాల్సిన మందులు అందించేందుకు స్పష్టమైన విధానం రూపొందించామని చెప్పారు. ఫార్మా కంపెనీల నుంచి నేరుగా బ్లాక్ ఫంగస్ వ్యాధి కోసం మందులు కొనేందుకు అనుమతి మంజూరు చేశామన్నారు.
లాక్ డౌన్ అమలుతో తెలంగాణాలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని, పాజిటివిటీ రేటు చాల తగ్గిందని చెప్పారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో 3,614 కేసులు నమోదయ్యాయని, 18 మంది మృతి చెందారని శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రభుత్వం నిబంధనలు ప్రజలు పాటించాలని పిలుపునిచ్చారు.