గద్వాల ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆయనపై అనర్హత వేటు వేసి రెండో స్థానంలో నిలిచిన బిజెపి నేత డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టిఆర్ఎస్ తరఫున పోటీ చేసిన కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ తప్పుల తడకగా ఉందని, తన ఆస్తుల ప్రకటనలో తప్పుడు సమాచారం ఇచ్చారని హైకోర్టులో డీకే అరుణ వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదాలు విన్న న్యాయస్థానం కృష్ణమోహన్ రెడ్డిపై వేటు వేసింది. ఎస్సీలకు సంబంధించిన ఆస్తులను తనవిగా పేర్కొన్నారని హైకోర్టు అభిప్రాయపడింది. కృష్ణమోహన్ రెడ్డి కి రెండున్నర లక్షల జరిమానా తో పాటు కోర్టు ఖర్చుల కింద అరుణకు 50 వేల రూపాయలు ఇవ్వాలని ఆదేశించింది.
గత నెలలో ఇదే తరహాలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వర రావు ఎన్నిక చెల్లదని తెలంగాణా హైకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై స్టే ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను తోసిపుచ్చింది. అయితే సుప్రీం కోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించి స్టే విధించింది,. దీనితో ఆయనకు కొంత ఊరట లభించింది,
తాజాగా హైకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి హైకోర్టులో స్టే కోసం పిటిషన్ వేస్తారా, లేదా నేరుగా సుప్రీం కోర్టుకు వెళతారా అన్నది వేచి చూడాలి. అయితే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సుమారు పది మంది వరకూ ఇలాంటి కేసులను ఎదుర్కొంటున్నారు. మంత్రి శ్రీనివాస గౌడ్ కూడా ఈ తరహా కేసుపై న్యాయపోరాటంలో ఉన్నారు.