ఆంధ్ర సరిహద్దుల్లో అంబులెన్సులు అడ్డుకోవడంపై తెలంగాణా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులపై అత్యవసర విచారణ చేపట్టిన హైకోర్టు అంబులెన్సులు అడ్డుకుంటే కోర్టు ధిక్కరణ నోటిసులు ఇస్తామని హెచ్చరించింది. సరిహద్దుల్లో అంబులెన్సులు అడ్డుకోవాలని మీకు ఎవరు చెప్పారంటూ అధికారులను ప్రశ్నించింది.
నేటి విచారణకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు హాజరయ్యారు. కరోనాను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదన్న కోర్టు పరిక్షలు ఎందుకు తగ్గించారంటూ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది.
పాతబస్తీలో కరోనా ఆంక్షలు సరిగా పాటించడం లేదని వ్యాఖ్యానించిన కోర్టు, సామూహిక ప్రార్థనల్లో కరోనా నిబంధనలు పాటించలేదని ఆగ్రహం వ్యాఖ్యానించింది. రంజాన్ అయిపోయిన తర్వాత లాక్ డౌన్ పెడదాము అనుకుంటున్నారా అని ప్రశ్నించిన కోర్టు ఈలోగా ఎంత వ్యాప్తి చెందుతుందో మీకు తెలుసా అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది. లాక్ డౌన్, కర్ఫ్యూ కఠినంగా అమలు చేయడంపై ప్రభుత్వ విధానం ఏమిటో చెప్పాలని అడిగింది.
కాగా, క్యాబినెట్ 2 గంటలకు సమావేశం అవుతోందని, నిర్ణయం 2.30కి తెలియజేస్తామని అడ్వకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. తదుపరి విచారణను హైకోర్టు 2.30 గంటలకు వాయిదా వేసింది.