Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఏది పాస్? ఏది ఫెయిల్?

ఏది పాస్? ఏది ఫెయిల్?

All are Passed:
తీవ్రమయిన, నిశితమయిన దృష్టితో చూడ్డం పరీక్ష.
ఈక్ష, వీక్షణం, చక్షువు మాటల్లో ప్రధానమయినది చూపే. లేదా దృష్టికి సంబంధించినది.

ప్రపంచాన్ని కరోనా చెరపట్టి ఇప్పటికి మూడేళ్లు. తాజాగా మూడో దశకు ఓమైక్రాన్ అని కరోనా తనకు తానే నామకరణం చేసుకుంటే…ఓ మైగాడ్ అని నిట్టూర్చడం తప్ప మనం చేయగలిగింది లేదు. కరోనా మౌలిక భావనలోనే నిర్ధారణ పరీక్షలో నెగటివ్ వస్తే పాస్ అయినట్లు. పాజిటివ్ వస్తే ఫెయిల్ అయినట్లు.

తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డ్ ఈ మౌలికమయిన భావనను విస్మరించినట్లుంది. లేదా విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ అవగాహన కలిగించడంలో బోర్డ్ విఫలమయినట్లు ఉంది.

కరోనా వేళ ఏమి చదివారో? ఎలా చదివారో? విద్యార్థులకే తెలియలేదు. ఈలోపు రెండేళ్ల ఇంటర్ అయిపోయింది. ఇంటర్ పాస్ అయినవారు ఎలా పాసయ్యామో అని ఆశ్చర్యంలో ఉన్నారు. ఫెయిల్ అయినవారు ఎందుకు ఫెయిలయ్యారో తెలియక అయోమయంలో ఉన్నారు.

కరోనా రెఫరెన్సుతో చూస్తే పరీక్షలో ఫెయిల్ అయినవారు పాస్ అయి సేఫ్ గా ఉన్నట్లు అనుకోవాలి. కానీ వేదాంతం ఎప్పుడయినా మాటలకే కానీ…చేతల్లో చైతన్యం చైతన్యమే. నారాయణం నారాయణమే. అందువల్ల చేత మేము ఫెయిల్ ఎలా అవుతాం? బోర్డే గుడ్డిగా మా పేపర్లు దిద్ది ఉంటుంది అంటూ వీధులకెక్కారు. కరోనా పదో తరగతిలా ఇంటర్లో కూడా అందరినీ పాస్ చేసి…తాంబూలాలిచ్చాము…అని చేతులు దులిపేసుకుంటే పోలా! అన్నది బోర్డు తాజా ఆలోచన. ప్రభుత్వ నిర్ణయమే తరువాయి.

కరోనా పెట్టిన పరీక్షలో ప్రపంచానికి పాస్ మార్కులు రావడం లేదు. కరోనా వేళ పెట్టే అన్ని పరీక్షల్లో విద్యార్థులు మాత్రం పరీక్షలు రాయకుండా అయినా పాస్ కాగలుగుతున్నారు.

కరోనా ఎక్కువ కాలం ఉంటే…ఒక తరానికి పరీక్షల్లేని పాస్ గ్యారెంటీ వెసులుబాటు వచ్చేలా ఉంది.

కాలం పెట్టే పరీక్షలో…
ఏది పాస్?
ఏది ఫెయిల్?
అంతా నెగటివ్ లో పాజిటివ్ ను వెతుక్కోవడం- అంతే!
లేదా పాజిటివ్ వస్తే నెగటివ్ కోసం ఎదురు చూడ్డం- అంతే!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :  నాడి తెలిసిన చైతన్యం- ర్యాంకు రప్పించిన నారాయణం

RELATED ARTICLES

Most Popular

న్యూస్